నేను రాజకీయాల్లో ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు: కవిత

నేను రాజకీయాల్లో ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు: కవిత

రాజకీయాల్లో ఏది మాట్లాడినా తన  మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇలానే టార్గెట్ చేస్తారనే భావనతోనే కొందరు కావాలనే ఈ ట్రోలింగ్స్‌కు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ ప్రపంచంలో జెండర్ బయాస్ (లింగ వివక్ష) కొనసాగుతోంది. అనేక రంగాల్లో మగవారికే ప్రాధాన్యత లభిస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కులాల కంటే.. మగవారి కులం, ఆడవారి కులం అనే రెండు మాత్రమే ఉన్నాయనిపిస్తోందని కవిత వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన వేట విమెన్ ఎంపవర్‌మెంట్ సమ్మిట్‌లో మాట్లాడిన కవిత..  సమాజంలో, రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై ఆమె ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ వచ్చాక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తెచ్చుకున్నా.. ఇప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. జీన్-జెడ్ (GenZ) జనరేషన్‌లోనూ అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు ఎదగాలని చూస్తే వెంటనే తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ, బ్యాంకింగ్, మీడియా రంగాల్లో ఎంత సత్తా చాటుతున్నా.. పెళ్లి, కుటుంబ బాధ్యతల వల్ల మళ్లీ కెరీర్‌ను మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోందని, అందుకే మహిళలకు ప్రభుత్వాలు, కుటుంబం, సమాజం సపోర్ట్ ఇవ్వాలని కోరారు.

బాల్య వివాహాలపై కవిత షాకింగ్ గణాంకాలను బయటపెట్టారు. 2026 లో కూడా తెలంగాణ గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని.. పెళ్లైన 15-19 ఏళ్ల మధ్యలోనే అమ్మలవుతున్న టీనేజర్ మదర్స్ గ్రామీణ ప్రాంతాల్లో 7.2 శాతం ఉంటే, హైదరాబాద్ లాంటి మహానగరంలోనే 2.7 శాతం మంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు పిలుపునిస్తూ.. సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్స్ రాలేదని నిరుత్సాహపడొద్దని, మహిళలంతా ఒక మంచి టార్గెట్ పెట్టుకొని, దాన్ని సాధించే దిశగా బలమైన గొంతుకతో ముందుకు సాగాలని కవిత పిలుపునిచ్చారు.