బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలవాలి : మంత్రి కొండా సురేఖ

బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలవాలి : మంత్రి కొండా సురేఖ
  • కొత్త ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫెసిలిటీలపై మంత్రి కొండా సురేఖ  సమీక్ష 

హైదరాబాద్​, వెలుగు: బయోమెడికల్‌‌‌‌ వ్యర్థాల నిర్వహణలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్‌‌‌‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బయోమెడికల్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రూల్స్‌‌‌‌–2016 అమలు, యూజర్‌‌‌‌ చార్జీలు, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్త కామన్‌‌‌‌ బయోమెడికల్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫెసిలిటీల ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలు, పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు చేపట్టిన గ్యాప్‌‌‌‌ అనాలిసిస్‌‌‌‌ స్టడీ పురోగతిపై అధికారులను ప్రశ్నించారు.  వైద్యారోగ్య శాఖ సిబ్బందికి బయోమెడికల్‌‌‌‌ వ్యర్థాల నిర్వహణపై నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జీవవైద్య వ్యర్థాలను 48 గంటల్లోపు సేకరించి, శుద్ధి చేసి, తదుపరి ప్రక్రియలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతికతతో ప్రజలకు ఎలాంటి ముప్పు లేకుండా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు. వరంగల్‌‌‌‌లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్లాస్టిక్‌‌‌‌ బాటిళ్ల సేకరణను పైలట్‌‌‌‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని, సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ను పూర్తిగా నిషేధించే కార్యాచరణ రూపొందించాలని పీసీబీ అధికారులను ఆదేశించారు.