ప్రతి మండలంలో కమ్యూనిటీ ప్లేగ్రౌండ్..ప్రతి ప్లేయర్ కు డిజిటల్ ఐడీ

ప్రతి మండలంలో కమ్యూనిటీ ప్లేగ్రౌండ్..ప్రతి ప్లేయర్ కు డిజిటల్ ఐడీ
  • ఏఐతో ఫండ్స్ మానిటరింగ్  
  • 2047 నాటికి స్పోర్ట్స్ క్యాపిటల్ గా తెలంగాణ 
      
  • విజన్ 2047కు అనుగుణంగా స్పోర్ట్స్ పాలసీ తెస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికే స్పోర్ట్స్ క్యాపిటల్​గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో కమ్యూనిటీ ప్లే గ్రౌండ్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి ప్లేయర్ కు ఒక డిజిటల్ ఐడీ కేటాయించడం, నిధుల వ్యయంపై ఏఐ టెక్నాలజీతో పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టనున్నది. ‘‘ఆటంటే ఏదో సాయంత్రం ఆడినం.. వదిలేసినం అన్నట్టు ఉండొద్దు. అది బతుకుదెరువు కావాలె. 

ఆరోగ్యానికి ఆయువు పట్టు కావాలె..” అనే లక్ష్యంతో కొత్త స్పోర్ట్స్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేయిస్తున్నారు. స్పోర్ట్స్ అంటే కేవలం మెడల్స్ కోసమే కాదు.. క్రీడలనే కెరీర్ గా మలచుకునేలా ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ-2025’ను తీసుకురానున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్​లో దీనికి సంబంధించి కీలక అంశాలను పొందుపరిచారు. పల్లెటూర్ల నుంచి ఇంటర్నేషనల్ లెవల్ దాకా ప్లేయర్లను తయారు చేసేలా పక్కా ప్లాన్ ను సర్కారు రెడీ చేసింది. 

ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనుంది. ఇకపై సీఎం కప్ లో గెలిచిన విన్నర్లను వదిలేయకుండా.. వాళ్లను నేరుగా హై-పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్స్‌‌‌‌కు సెలెక్ట్ చేసి, ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ’లో ప్రముఖ కోచ్ లతో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించనున్నారు.   

కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్.. డిజిటల్ ఐడీలు..  

గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులున్నారు. కానీ వారి టాలెంట్ వెలికి తీసేందుకు సరైన వసతులు, రూట్ లేకుండా పోయింది. అయితే, ఈ సమస్యకు సర్కారు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. దీనిలో భాగంగా ప్రతి మండలంలో ‘కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్’ తీసుకురావాలని సర్కారు నిర్ణయిచించింది. 

సీఎస్ఆర్ నిధులతో సర్కార్ వీటిని డెవలప్ చేయనున్నది. గిరిజన, గ్రామీణ పిల్లలు, ఆడపిల్లలకు, పారా అథ్లెట్లకు సమాన అవకాశాలు కల్పించడమే  టార్గెట్ గా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రతి ప్లేయర్ కు ఆధార్ కార్డు మాదిరిగానే డిజిటల్ ఐడీని ఇవ్వనున్నారు. 

దీంట్లో ఎప్పటికప్పుడు వారి రికార్డులు, స్కిల్స్ అన్నీ అప్​డేట్ చేస్తారు. ఇవన్నీ ‘స్టేట్ స్పోర్ట్స్ డ్యాష్‌‌‌‌బోర్డ్’లో పొందుపరుస్తారు. మరోపక్క మారుమూల ప్రాంతాల్లోని ప్లేయర్ల టాలెంట్ ను వెలికి తీసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడనున్నారు. దీంతో పాటు ప్లేయర్లకు ఇచ్చే నిధులు పక్కదారి పట్టకుండా కూడా ఏఐ ద్వారానే ‘ఫండ్ మానిటరింగ్’ చేయనున్నారు. 

బడి నుంచే ‘ఫిట్‌‌‌‌నెస్’ పాఠాలు

చదువుతో పాటే ఆటలు ఉండాలనేది సర్కార్ లక్ష్యం. అందుకే స్కూళ్లలో ‘ఫిట్‌‌‌‌నెస్ బెంచ్ మార్క్స్’ పెడుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల క్రీడా సామర్థ్యం ఎట్లుందో ట్రాక్ చేస్తారు. ఇందుకోసం క్రీడా శాఖ, విద్యా శాఖ కలిసి పని చేయనున్నాయి. మరోపక్క ఆటల ద్వారా ఉపాధి కూడా కల్పించొచ్చని సర్కారు భావిస్తోంది. స్పోర్ట్స్ టూరిజం డెవలప్​తో పాటు బ్యాట్లు, బాల్స్ తయారీ, స్పోర్ట్స్ అనలిటిక్స్ లాంటి రంగాల్లో స్పోర్ట్స్ టెక్ స్టార్టప్ లను ప్రోత్సహించాలని డిసైడ్ అయింది.