తెలంగాణ అమర వీరుల జ్ఞాపకార్థం : సిద్ధమవుతున్న ‘అమరజ్యోతి’

తెలంగాణ అమర వీరుల జ్ఞాపకార్థం : సిద్ధమవుతున్న ‘అమరజ్యోతి’

హైదరాబాద్ : భాగ్యనగర పర్యాటక కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. తెలంగాణ అమర వీరుల జ్ఞాపకార్థం హైదరాబాద్ మహానగరంలో అత్యాధునిక స్మారక స్తూపం సిద్ధమవుతోంది. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వందలాది మంది అమర వీరుల స్మారకంగా ఈ భవనం నిలవబోతోంది. ఇక్కడ నిరంతరం వెలిగే జ్యోతిని ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక పరంగా చూస్తే…రాజధాని నగరంలో అత్యంత ఆకర్షణీయమైన భవనంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. 10,300 స్క్వేర్‌‌ మీటర్‌‌ ఏరియాలో భవనాన్ని నిర్మిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చెంత నిర్మితమవుతున్న ఈ భవనాన్ని వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీ నాటికి పూర్తి చేసి ప్రజల సందర్శనార్థం సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులను రోడ్లు, భవనాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తుండగా.. పనులు వేగంగా జరుగుతున్నాయి. మూడు లిఫ్ట్‌‌లు ఏర్పాటు చేస్తున్నారు. భవనమంతటా ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 120 మంది వరకు కార్మికులు పని చేస్తుండగా త్వరలో
200 మంది వరకు పనిచేస్తారని నిర్మాణ సంస్థ (కేపీసీ ప్రాజెక్స్‌ట్ ) మేనేజర్‌‌ సురేంద్ర తెలిపారు.

మొత్తంగా భవనం 42 మీటర్ల ఎత్తు ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన తొలి ఉద్యమంతో పాటు మలి దశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలు అర్పించారు. ఈ స్మారక భవనంలో తెలంగాణ చరిత్రకు సంబంధిం చిన సకల వివరాలను తెలియజేసేలా ప్రణాళిక రూపొందించారు. వచ్చే కొన్నేళ్లలో నగరంలోనే ఇది అతి పెద్ద పర్యాటక కేంద్రం కానుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసుకున్న వారి స్మృత్యర్థం అనేక ఏళ్ల కిందటే గన్ పార్కులో అమర వీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. పలు సందర్భాల్లో అక్కడ అమరవీరులకు నివాళి అర్పిస్తున్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత అమరవీరుల స్మృత్యర్థం అత్యాధునిక స్మా రక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా హుస్సేన్ సాగర్ చెంతన లుంబిని పార్కుకు ఆనుకుని ఉన్న ఈ నిర్మాణాన్ని కొన్ని నెలల క్రితం మొదలుపెట్టారు. బహుళ అంతస్తుల ఈ నిర్మాణానికి రూ.65 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు.

మొత్తం ఐదు అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారు. రెండు అంతస్తులను పార్కింగ్ కోసం నిర్మిస్తున్నారు. ఇందులో 369 కార్లు, 300 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లో ర్‌‌లో వివిధ రకాల వర్క్‌‌షాపులు నిర్వహించు కునేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి అంతస్తులో తెలంగాణ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడియో విజువల్ రూమును ఏర్పాటు చేయనున్నారు. రెండో అంతస్తులో కన్వెన్షన్ హాలు, ఆ తర్వాతి అంతస్తులో రెస్టారెంట్‌, హుస్సేన్‌‌ సాగర్‌‌ సమీపంలోని పర్యాటక అందాలను చూడటానికి వ్యూ పాయింట్‌ ను ఏర్పాటుచేస్తారు. మొదటి నుంచి చివరి అంతస్తు వరకు అమరజ్యోతి నిర్మాణం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర, తెలంగాణ మహానుభావులకు సంబంధించిన ఫొటోలు, ఇతర రూపాల్లో తెలియజేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు. అత్యాధునిక గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ భవనం చుట్టూ పచ్చదనంతో కూడిన అతి పెద్ద పార్కును ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు తెలంగాణ చరిత్ర తెలుసుకోవడమే కాకుండా ఇక్కడ కొం తసేపు సేదదీరేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.