తెలంగాణలో స్క్రాప్ పాలసీ.. స్వచ్ఛందంగా వెహికల్స్ ఇస్తే ట్యాక్స్ ​మినహాయింపు

తెలంగాణలో స్క్రాప్ పాలసీ.. స్వచ్ఛందంగా వెహికల్స్ ఇస్తే ట్యాక్స్ ​మినహాయింపు
  • వెహికల్స్​ను స్వచ్ఛందంగా ఇస్తే ట్యాక్స్ ​మినహాయింపు: మంత్రి పొన్నం
  • 15 ఏండ్లు పైబడిన బండ్లు స్ర్కాప్​ చేసుకోవచ్చు
  • సారథి, వాహన్​ పోర్టల్​లో చేరుతున్నం
  • రూల్స్​ ఉల్లంఘించి డ్రైవ్​ చేస్తే లైసెన్స్​ రద్దు చేస్తం
  • ఇప్పటి వరకు 8 వేల లైసెన్స్​లు క్యాన్సిల్ ​చేశామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో వాహనాల స్ర్కాప్​ పాలసీని అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. 15 ఏండ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్​ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బంది వస్తుండడంతో రాష్ట్రం మంగళవారం నుంచి సారథి, వాహన్​ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.  క్షేత్రస్థాయిలో ఆర్టీవో, డీటీవోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, దీని అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి, వాహన్ పోర్టల్ సాఫ్ట్​​వేర్​ను అమలు చేస్తున్నాయని చెప్పారు. జీవో 28 ద్వారా ఇది అమలవుతున్నదని వెల్లడించారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్​ నిబంధనలు పాటించని వారి డ్రైవింగ్​ లైసెన్సులు కూడా రద్దు చేసేందుకు వెనకాడబోమని అన్నారు. ఇప్పటి వరకు 8 వేల డ్రైవింగ్​ లైసెన్స్​లు  రద్దు చేసినట్టు చెప్పారు. మంగళవారం సెక్రటేరియెట్​లో స్పెషల్​ సీఎస్​ వికాస్​రాజ్​​, ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ ఇలంబర్తితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్​ మీడియాతో మాట్లాడారు. వాహనాల స్క్రాపింగ్​ను ప్రోత్సహించేందుకు పాత వాహనం స్ర్కాప్​ చేస్తే.. కొత్త వాహనంపై ఉండే గ్రీన్​ టాక్స్​, క్వార్టరీ పన్నుపై పెనాల్టీ మినహాయిస్తామని చెప్పారు. 

ట్రాన్స్​పోర్ట్ వాహనాలైతే 20 ఏండ్లలోపు స్ర్కాప్​కు ఇస్తే.. ప్రతి ఏటా పన్నుపై 10 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. ఉదాహరణకు సొంత టూ వీలర్​ వెహికల్​ రూ.లక్ష లోపు ధర ఉన్నది స్ర్కాప్​కు ఇస్తే.. కొత్త వాహనానికి ట్యాక్స్​లో రూ.1000 మినహాయింపు ఉంటుందని చెప్పారు. అదే ఫోర్​ వీలర్​లో  రూ.5 లక్షలు పెట్టి కొత్తది తీసుకుంటే రూ.10 వేలు ట్యాక్స్​ మినహాయింపు వస్తుందని మంత్రి పొన్నం వివరించారు. ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వంలో ఉన్న వాహనాలేవీ  కూడా కండిషన్​ లేకుండా లేవని, అలా ఉంటే వెంటనే రీప్లేస్​ చేస్తున్నట్టు తెలిపారు.  వాహనాల చెకింగ్‌‌‌‌‌‌‌‌కు సరైన విధానం అమలు జరగడం లేదని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నామని చెప్పారు. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌కు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇక  ప్రభుత్వ పాత వాహనాలను ఈ– ఆక్షన్​ ద్వారా దశలవారీగా తొలగిస్తామని చెప్పారు. 

ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే..

సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ‘‘ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. వాహనాలు కొనుక్కున్నా.. వారి పేరు మీద రిజిస్ట్రేషన్​ చేసుకునే అవకాశం ఉండదు. ప్రాణ నష్టంపై అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చిన్న పిల్లలస్థాయి నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. ర్యాష్​ డ్రైవింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలకు కూడా ఈ రూల్స్​ వర్తిస్తాయి.  నిబంధనలు ఉల్లఘించి వాహనాల లైసెన్స్ రద్దయితే వాళ్లు వెహికల్స్​కొనడానికిగానీ.. నడపడానికిగానీ పర్మిషన్​ ఉండదు” అని పేర్కొన్నారు. తమ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచే కాకుండా యూనిసెఫ్ వారితో కూడా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. రూల్స్​ పాటించకపోతే డ్రైవింగ్​ లెసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. కొత్తగా 113 మంది వెహికల్ ఇన్స్పెక్టర్లు నియామకాలు పూర్తి చేసుకొని, విధుల్లో చేరబోతున్నట్టు తెలిపారు. వారి సేవలను విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆర్టీసీలో ఎంవీఐ రూల్స్ అమలవుతున్నాయని, ఎక్కడా ఇబ్బంది లేదని అన్నారు.  టీఎస్ నుంచి టీజీకి మారినప్పుడు.. టీఎస్ వాహనాలు మళ్లీ టీజీగా మారుతాయని చెప్పలేదని, కొత్త వాహనాలు టీజీగా వస్తున్నాయని చెప్పారు.

37 టెస్టింగ్​ సెంటర్లకు అనుమతి: కమిషనర్ ఇలంబర్తి

సొంత వెహికల్ 15 ఏండ్లు దాటిన తర్వాత వలంటీర్​గా స్క్రాపింగ్ కోసం ఇస్తే  సర్టిఫికెట్​ ఆఫ్డిపాజిట్​ వస్తుందని  ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్  ఇలంబర్తి తెలిపారు. వచ్చే రెండేండ్లలో అదే రేంజ్​లో కొత్త వాహనం కొంటే  దాని ఎంవీ టాక్స్ లో మినహాయింపు ఉంటుందని వివరించారు.  పాత బకాయిలు ఉన్నా వెహికల్​ స్క్రాప్ కి తీసుకెళ్తే వన్ టైం సెటిల్​మెంట్ చేసేలా కూడా అవకాశం ఉందని చెప్పారు.  ప్రభుత్వం 37 ఆటో మేటెడ్​ టెస్టింగ్ సెంటర్స్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందని, జిల్లాలో 33,  హైదరాబాద్ లో 4 అదనంగా పెట్టనున్నట్టు చెప్పారు. ఒక్కో దానికి రూ.8 కోట్లు అవసరం అవుతుండగా.. మొత్తం రూ. 296 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సారథి, వాహన్  సాఫ్ట్​వేర్​ను ఏడాదిలోపు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని, సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్​ జరుగుతున్నదని చెప్పారు. 15 ఏండ్లు దాటిన ప్రైవేట్ వాహనాలను కచ్చితంగా స్క్రాపింగ్ చేసుకోవాలనే కండిషన్​ లేదని, వారి ఇష్టపూర్వకంగానే  చేసుకోవచ్చునని తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు 8 ఏండ్లలోపు ప్రతి ఏటా, త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఇస్తారన్నారు. 15 ఏండ్లు దాటిన వాహనాలు స్క్రాప్ కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.