
- బీజేపీకి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం హితవు
బషీర్బాగ్, వెలుగు: బీజేపీ లీడర్లు బీసీ రిజర్వేషన్లపై డబుల్ స్టాండర్డ్స్ మానుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హితవు పలికారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడారు.
బీసీ కేటగిరిలోకి 10 శాతం ముస్లింలు వస్తారని, బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని కిషన్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టం చేస్తే ముస్లింలకు ఒక్క శాతం కూడా రాదనే విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తించాలన్నారు. వీపీ సింగ్ హయాంలో బీపీ మండల్ సిఫార్సులు అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎల్ కే అద్వానీ నేతృత్వంలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలు చేసిన చరిత్ర బీజేపీదని గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు , కిషన్ రెడ్డి బీసీల మీద విషం చిమ్ముతున్నారని, వారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.