హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించాలనుకున్న విద్యార్థి మహాధర్నాకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో, బీజేపీ తన వ్యూహాన్ని మార్చినట్టు ప్రకటించింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాసినందుకు నేరుగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపింది.
ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వేముల అశోక్, వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని నేతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ మాదిరిగా అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ముందస్తు అరెస్టులకు పాల్పడినా సోమవారం ఉదయం 11 గంటలకు వేలాది మంది విద్యార్థులు, కార్యకర్తలతో అసెంబ్లీని ముట్టడించి తీరుతామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే స్పష్టం చేశారు.
