ఫిబ్రవరి 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర

ఫిబ్రవరి 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర
  • మార్చి 1న ముగింపు.. 11 రోజుల పాటు సాగనున్న యాత్ర
  • 16 లోక్​సభ నియోజకవర్గాల్లోని 112 సెగ్మెంట్లు కవర్ చేసేలా 
  • రూట్​మ్యాప్యాత్రను ఐదు క్లస్టర్లుగా విభజించిన నేతలు
  • హాజరుకానున్న సీఎంలు, కేంద్ర మంత్రులు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంగళవారం నుంచి విజయ సంకల్ప యాత్రలను బీజేపీ ప్రారంభించనుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర.. మార్చి 1న ముగియనుంది. 16 లోక్​సభ నియోజకవర్గాల్లో 112 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్ర నిర్వహించేందుకు రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించినట్టు బీజేపీ అధిష్టానం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాటికి కుమ్రంభీం, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ భద్రకాళీ, కృష్ణమ్మగా పేర్లు పెట్టింది. ఈ క్లస్టర్ల వారీగా పార్టీ నేతలు విజయ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. కుమ్రంభీం క్లస్టర్​లో భాగంగా నిర్మల్ జిల్లాలోని ముధోల్​లో యాత్ర ప్రారంభమై నిజామాబాద్ జిల్లాలోని బోధన్​లో ముగుస్తుంది. ఈ క్లస్టర్​లో మూడు లోక్​సభ సెగ్మెంట్లలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేయనున్నారు. యాత్రకు సంబంధించిన ప్రచార రథాలకు సోమవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూర్​లో ప్రారంభం

రాజరాజేశ్వరి క్లస్టర్​లో వికారాబాద్ జిల్లాలోని తాండూర్​లో యాత్రను ప్రారంభించి కరీంనగర్​లో ముగించనున్నారు. ఈ క్లస్టర్​లో 4 లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలోని 28 అసెంబ్లీల్లో యాత్ర చేపడ్తారు. భాగ్యలక్ష్మి క్లస్టర్​లో భాగంగా భువనగిరి నుంచి యాత్రను ప్రారంభించి హైదరాబాద్​లో ముగిస్తారు. ఇక్కడ మూడు లోక్​సభ సెగ్మెంట్లలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. కాకతీయ భద్రకాళీ క్లస్టర్​లో భద్రాచలం నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. ములుగులో ముగిసే ఈ క్లస్టర్ యాత్రలో మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు, 21 అసెంబ్లీలను చుట్టేసి రానున్నారు. ఇక కృష్ణమ్మ క్లస్టర్​లో భాగంగా మహబూబ్​నగర్ జిల్లా మక్తల్​లో యాత్ర ప్రారంభమై నల్గొండలో ముగుస్తుంది. మూడు లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు యాత్రలు చేస్తారు.

జాతీయ నేతలు హాజరు

ఈ విజయ సంకల్ప యాత్రల్లో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలూ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి.కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్​, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ అన్ని క్లస్టర్లలో జరిగే యాత్రల్లో పాల్గొంటారు. కుమ్రంభీం క్లస్టర్​ యాత్ర ప్రాంభోత్సవానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొంటారు. రాజరాజేశ్వరి క్లస్టర్​లో యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు. కృష్ణమ్మ క్లస్టర్​లో సాగే యాత్రను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ షురూ చేస్తారు. యాత్ర సాగే కొద్దీ పలువురు జాతీయ స్థాయి నేతలు, మరికొన్ని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలూ పాల్గొననున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అయోధ్య రామాలయం గురించి కూడా ప్రజల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు.