- శాతవాహన వర్సిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీకి మిగిలిన పనుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.125 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. శాతవాహన యూనిర్సిటీ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది.
వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు గతంలో ఏటా రూ.15 కోట్ల వరకు కేటాయిస్తుండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.28.90 కోట్లకు పెంచడం విశేషం. వరంగల్, కరీంనగర్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూళ్లకు రూ.42 కోట్లు కేటాయించింది. దీంతో వరద కాల్వకు రూ.249.41 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.449.66 కోట్లు కేటాయించింది.
మానేరు రివర్ ఫ్రంట్ పనులపై నీలినీడలు
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఇక ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.కోటి మాత్రమే కేటాయించింది. గతంలో ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. గతంలో ఎన్జీటీ ఆదేశాలతో రెండేళ్లు పనులు ఆగగా.. ఆ తర్వాత క్లియరెన్స్ వచ్చినప్పటికీ ప్రభుత్వం సముఖంగా లేకపోవడం, నిధులు కేటాయించకపోవడం పనులు సాగడంలేదు.
