ఎల్నినో ఎఫెక్ట్‌‌‌‌పై ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీ .. చిన్నారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటు

ఎల్నినో ఎఫెక్ట్‌‌‌‌పై ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీ .. చిన్నారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటు
  • రిపోర్ట్ ఆధారంగా వ్యవసాయం, తాగు, సాగునీరు, కరెంట్‌‌‌‌పై ప్రత్యామ్నాయ ప్రణాళిక
  • 20న ఉమ్మడి జిల్లాలవారీగా మంత్రుల ఆధ్వర్యంలో అత్యవసర సమీక్షలు
  • ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు ఊరూరా అవగాహన కార్యక్రమాలు
  • ధరణి అక్రమాలు, అవకతవకలపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్(సెట్) ఏర్పాటు
  • ఇప్పటివరకు జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలపై లోతుగా దర్యాప్తు
  • గ్రామ పంచాయతీల ఆదాయం నేరుగా వాడుకునేలా చట్ట సవరణకు ప్రతిపాదన 
  • రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీని వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రణాళికా మండలి వైస్​ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ఈ కమిటీ వేయనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న దానిపై కమిటీ నివేదికలను రూపొందిస్తుంది. జిల్లాలవారీగా నెలకొన్న పరిస్థితులకు అనుకూలమైన పంటలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గం రిపోర్ట్​ తీసుకోనుంది. దీంతోపాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్​నినో ప్రభావంపై కేంద్రానికి లేఖ రాయాలని కేబినెట్ ​నిర్ణయించింది. రాష్ట్రంలోని క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్ నినో ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేయనుంది. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్​ సెక్రటేరియెట్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 36వ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఎల్​నినో పరిస్థితులు, సాగు, తాగునీటి అవసరాలు, ధరణిలో అక్రమాలు, పంచాయతీలకు నిధుల కష్టాలు, తదితర అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణా రావు, అడ్లూరి లక్ష్మణ్‌‌లతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు, ఎల్​నినో ప్రభావంపై అన్ని జిల్లాల్లోనూ రైతులకు అవగాహన కల్పించాలని కేబినెట్‌‌లో నిర్ణయించామని తెలిపారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరికి బదులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ‘‘అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, తక్షణం చేపట్టాల్సిన చర్యలను తెలుసుకునేందుకు అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 20న ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ప్రతి జిల్లా ఇంచార్జి మంత్రితో పాటు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ బాధ్యతలు తీసుకోవాలి. ఈ ప్రకృతి గండం నుంచి గట్టెక్కేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, సమన్వయంతో పనిచేసి వర్షాభావ సంక్షోభాన్ని అధిగమించేలా చర్యలు చేపడుతున్నాం’’ అని మంత్రి పేర్కొన్నారు.  

ధరణిపై సెట్​ఏర్పాటు

భూముల రికార్డులు, క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం (స్పెషల్ ఎంక్వైరీ టీమ్​–సెట్) ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘‘2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్‌‌లో దాదాపు 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

అందుకే భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఎల్​అండ్ ఎఫ్ఎస్(ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్) పాత్రతో పాటు, పోర్టల్ నిర్వహణ సంస్థ ఎంపిక, టెండర్ ప్రక్రియ, వెండర్‌‌‌‌కు కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్ రూపకల్పన, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో ఉన్న లోపాలపై విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది. ధరణిలో పోర్టల్‌‌ తర్వాత కొన్ని మాడ్యుల్స్ మార్చి రైతులకు ఉపయోగంగా ఉండేలా మా ప్రభుత్వం భూభారతి అమల్లోకి తెచ్చింది. ఇప్పటికీ ఆ నాడు సాఫ్ట్ వేర్ రూపకల్పన చేసిన పోర్టల్‌‌లో ఉన్న లోపాలతో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ధరణి వ్యవహారంలో బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన తెలిపారు. 

టెండర్లకు యూనిఫైడ్​ విధానం

టెండర్లన్నింటికీ యూనిఫైడ్ విధానాన్ని రూపొందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వీటిపై సమగ్ర సమీక్షకు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, ల్యాండ్ అసెంబ్లీ, కొనుగోళ్లు, కాంట్రాక్టు నిర్వహణ వరకు అన్ని దశలను పరిశీలించేలా నిర్దిష్ట విధివిధానాలతో ఈ కమిటీ ఏర్పాటు ఉంటుందన్నారు. ‘‘ప్రభుత్వం చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో పరిపాలన అనుమతులతో పోలిస్తే అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంచనా వ్యయానికి, అయ్యే వ్యయానికి పొంతన కుదరడంలేదు. పనులు సకాలంలో పూర్తి కావట్లేదు. మంజూరైన అంచనాలు, సవరించిన అంచనాలతో పని పూర్తయ్యేవరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతున్నది.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికైన సంస్థల్లో ట్రాన్స్‌‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. గ్రామ పంచాయతీల నిధులను ఇప్పటిదాకా ట్రెజరీలో జమ చేసేవారని, కానీ, ఇప్పుడు సమీప బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అందుకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు రాష్ట్ర కేబినెట్ ఓకే చెప్పిందన్నారు.

శంషాబాద్‌‌లో రైల్​ హబ్​ 

హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌‌మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్ అండ్ బీ అధికారులు కేబినెట్‌‌కు తెలియజేశారని, శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్–పుణె–ముంబై రూట్, హైదరాబాద్–బెంగుళూరు రూట్, హైదరాబాద్–అమరావతి–తిరుపతి–చెన్నై రూట్‌‌లలో బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తుచేశారు. ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా ఈ లిఫ్ట్​ స్కీంను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను అంచనా వేసుకొని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపిందన్నారు. 

తాగునీటికే ప్రాధాన్యం

ఎల్‌‌‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం లోటు వర్షపాతం ఉన్న నేపథ్యంలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారని మంత్రి పొంగులేటి తెలిపారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున, అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారని చెప్పారు.

‘‘రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు చేసే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని, ఉత్పత్తి చేసిన విద్యుత్ సరిపోకుంటే అవసరమైతే కొనుగోలుకూ సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్​ సూచించారు. అన్ని ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడుకోవాలని నిర్ణయించాం’’ అని మంత్రి తెలిపారు.