
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, ఈడీ ఎదుట హాజరు నేపథ్యంలో మార్చి 9న తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది.
ఈడీ నోటీసులపై చర్చ..?
కేబినెట్ భేటీలో ముఖ్యంగా కవిత ఈడీ విచారణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవిత అరెస్టయితే ఏవిధంగా వ్యవహరించాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. అటు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి ప్రస్తావన వచ్చేఅవకాశం ఉంది.
రూ. 3 లక్షల ఆర్థిక సాయం..
సొంత స్థలాలు ఉండి....ఇండ్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విధి విధానాలపై కేబినెట్ చర్చించనుంది. అటు ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపైనా సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు.