తెలంగాణ కాంగ్రెస్ నేతలపై హైకమాండ్ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై హైకమాండ్ సీరియస్
  • మొన్న ఆత్రం సక్కు , రేగా కాంతారావు..
  • నిన్న లింగయ్య, నేడు హరిప్రియా నాయక్
  • తాజాగా సబితా ఇంద్రారెడ్డి చేరుతున్నట్టు ప్రచారం
  • రాష్ట్ర నేతలపై హైకమాండ్ సీరియస్!
  • ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ను వీడుతున్న ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ ఎస్ లోకి క్యూ కడుతుండటంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. మొన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెస్ ను వీడగా, శనివారం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆదివారం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. వారం వ్యవధిలోనే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడారు. సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా కారెక్కనున్నారనే సమాచారం పీసీసీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.

బుజ్జగించినా లాభమేదీ?

పార్టీలోనే ఉండాలని బుజ్జగించినా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో పీసీసీ నేతలు సతమతమవుతున్నారు. సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న ప్రచారంతో..  ఆదివారం పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆమె ఇంటికి వెళ్లారు. సబితను, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిని బుజ్జగిం చే ప్రయత్నం చేశారు. కానీ వారి నుంచి సానుకూల జవాబు రానట్టు తెలిసింది. సబిత కాంగ్రెస్ కు గుడ్ బై చెబితే.. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందేనని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నా యి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.

Telangana Congress Leaders Jumping into TRS

కేటీఆర్​తో సబితా ఇంద్రారెడ్డి భేటీ?

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలోనే టీఆర్‌ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. లోక్ సభ ఎన్నికల తర్వాత చేపట్టబోయే రాష్ట్ర కేబినెట్ విస్తరణలో సబితా ఇంద్రారెడ్డికి మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం రాజేంద్రనగర్ లోని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నివాసంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో భేటీ అయినట్టు సమాచారం. సబిత తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ఉదయమే అసదుద్దీన్ నివాసానికి వెళ్లారు. అటు కేటీఆర్ కూడా లోక్ సభ ఎన్నికల అంశమై అసదుద్దీన్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, సబిత, కార్తీక్ రెడ్డి 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టు తెలిసింది. కార్తీక్ కు చేవెళ్ల లోక్ సభ టికెట్‌ ఇవ్వాలని సబిత కోరగా.. దీని పై హామీ ఇవ్వలేనని కేటీఆర్‌ చెప్పినట్టు సమాచారం. తర్వాత సబిత ఎంపీ కవిత నివాసానికి వెళ్లి, సుమారు గంట పాటు మాట్లాడినట్టు సమాచారం.

Telangana Congress Leaders Jumping into TRS

గులాబీ వ్యూహాలతో చిత్తు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒక అభ్యర్థిని గెలిపించుకోగలమని కాంగ్రెస్ భావించింది. శాసన మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతుండటంతో.. ఇప్పుడు గెలిచే ఎమ్మెల్సీతో అయినా ప్రాతినిధ్యం నిలబడుతుందని అనుకుంది. కానీ వరుసగా ఎమ్మెల్యే లు పార్టీ వీడుతున్నారు. టీఆర్ఎస్ వ్యూహం ముందు పీసీసీ గిలగిల్లాడుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ శనివారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచార భేరిని మోగించగా.. మరునాడే సబిత వంటి సీనియర్ పార్టీ మారుతున్నారన్న వార్తలతో కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నీరుగారింది.

హైకమాండ్​ ఆగ్రహం

ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎందుకు ఆపలేక పోతున్నారని పీసీసీ నేతలను రాహుల్ నిలదీసినట్టు సమాచారం. శనివారం సభ తర్వాత ఢిల్లీ వెళ్లే ముందు ఎయిర్ పోర్టులో నేతలతో రాహుల్ మాట్లాడినట్టు తెలిసింది. ఫిరాయింపులు ఆపేందుకు ఏమేం చేస్తున్నారో చెప్పాలని కోరినట్టు సమాచారం.

Telangana Congress Leaders Jumping into TRS

టీఆర్​ఎస్ లోకి హరిప్రియా నాయక్

కాంగ్రెస్ ను వీడుతున్నట్టు ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్‌ ఆదివారం ప్రకటించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌  పడుతున్న తపనను చూసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వెల్లడించారు. ఇల్లెందు ప్రాంత అభివృద్ధి కోసం, ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చు కోవడం కోసం కేసీఆర్‌ బాటలో పయనిం చాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీకి సిద్ధమని ప్రకటించారు.

Telangana Congress Leaders Jumping into TRS

ప్రతిపక్షం లేకుండా చేసేందుకే: భట్టి

కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ప్రలోభపెడుతూ, తీవ్రంగా ఒత్తిడి చేసి పార్టీ ఫిరాయిం చేలా చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపిం చారు. ఆదివారం ఆయన సీఎల్పీ కార్యా లయంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కేసీఆర్ తీరును దేశవ్యాప్తంగా ఎండగడతామన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన పార్టీని కనుమరుగు చేయలేరన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేలుగా గెలిచారని, ఎమ్మెల్యే లు పార్టీ మారినా.. జనం కాంగ్రెస్ వెంటే ఉంటారని పేర్కొన్నారు.