
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే వెళ్లారు. ఇరువురు నేతల భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. బీసీ జన గణనకు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య, ఠాక్రే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సంఘాల మద్దతు కూడాగట్టే పనిలో సీరియస్ గా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే ఆర్. కృష్ణయ్యతోనూ ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారనే ప్రచారం సాగుతోంది.
దేశం, రాష్ర్టంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు, లేదా మూడు అసెంబ్లీ టికెట్లను బీసీ వర్గాలకు చెందిన వారికి ఇవ్వాలని ఇటీవల పీసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. బీసీ జన గణన చేయాలంటూ కొద్ది రోజులుగా రాజకీయ పార్టీల మద్దతును ఆర్. కృష్ణయ్య కూడగడుతున్నారు.
ఓబీసీలకు అండగా కాంగ్రెస్ : ఠాక్రే
తెలంగాణ ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాణిక్ రావు ఠాక్రే చెప్పారు. ఓబీసీలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కోరుతూ వచ్చారని తెలిపారు. ఈ విషయంలో ఆర్. కృష్ణయ్యతో మాట్లాడేందుకు వచ్చామన్నారు. ఓబీసీల సమస్యలు, బడ్జెట్, ప్రజా ప్రతినిధుల అంశాలపై కాంగ్రెస్ సానుకూలంగా ఉంటుందన్నారు. ఆర్. కృష్ణయ్య డిమాండ్స్..కాంగ్రెస్ నినాదం వేరు కాదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.