- మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్‌కు సీపీఎస్‌ఈయూ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్‌ఈయూ) నేతలు కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టే తెలంగాణలోనూ ఓపీఎస్‌ను తీసుకురావాలని కోరారు.
పెట్టుబడుల ఆధారిత పెన్షన్ ఉద్యోగులకు టెన్షన్‌గా మారిందన్నారు. మార్కెట్‌లో మార్పుల వల్ల ఇప్పటికే సుమారు రూ.1,800 కోట్ల సొమ్ము ఉద్యోగులు నష్టపోయారని చెప్పారు. సీపీఎస్ రద్దు అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ప్రత్యేక నోట్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అజారుద్దీన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు శ్రీకాంత్, నరేందర్ రావు పాల్గొన్నారు.
