గత హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికలు అక్రమం .. పాలక వర్గాన్ని రద్దు చేయాల్సిందే: టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి

గత హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికలు అక్రమం .. పాలక వర్గాన్ని రద్దు చేయాల్సిందే: టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌‌‌‌సీఏ)లో గత పాలక వర్గం ఎన్నికలు పూర్తిగా అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) డిమాండ్ చేసింది. 2023 అక్టోబర్ 20న జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ మంత్రులు కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకుని, తమ బంధువైన జగన్‌‌‌‌మోహన్ రావును ప్రెసిడెంట్‌‌‌‌గా గెలిపించుకున్నారని టీసీఏ జనరల్ సెక్రటరీ దారం గురువారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీసీఐ రాజ్యాగం ప్రకారం అసోసియేట్ సభ్యుల కేటగిరీలో ఉన్న ఇన్‌‌‌‌స్టిట్యూషన్లకు(ఆర్టీసీ, ఎస్‌‌‌‌బీఐ, ఎఫ్‌‌‌‌సీఐ వంటి సంస్థలు) ఓటు హక్కు ఉండకూడదు. 

ఒకవేళ ఓటు హక్కు కల్పించినా ఆయా ఇన్‌‌‌‌స్టిట్యూషన్ల తరఫున క్రికెటర్లు మాత్రమే ఓటు వేయాలి. కానీ, గత హెచ్‌‌‌‌సీఏ ఎన్నికల్లో చాలా సంస్థల తరఫున నామినేటెడ్ వ్యక్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఓట్లు వేశారు. జస్టిస్ లోధా కమిటీ సంస్కరణల ప్రకారం, మంత్రులు, ఐఏఎస్‌‌‌‌, ఐపీఎస్ అధికారులు క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అందుకు విరుద్ధంగా 23 ఇన్‌‌‌‌స్టిట్యూషన్ల తరఫున వాటి శాఖాధిపతులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రాక్సీలుగా వచ్చి ఓటు వేశారు. ఇది చట్టవిరుద్ధం. అప్పటి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత 47 ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ క్లబ్‌‌‌‌లపై  తీవ్ర ఒత్తిడి తెచ్చి జగన్‌‌‌‌ మోహన్ రావుకు ఓటు వేయించారు. ఈ విషయం ఓ అధికారి మా వద్ద అంగీకరించారు’’ అని  గురువా రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సంపత్ కుమార్, కేటీఆర్, హరీశ్‌‌‌‌, కవిత పాత్రపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌‌‌‌ చేశారు.