- ఎక్స్‌లో టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలకు గురైన బాధితులు నష్టపోయిన సొమ్మును తిరిగి అందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫీల్డ్ యూనిట్ల సమన్వయంతో ఇప్పటి వరకు 24,268 కేసుల్లో రూ.9.78 కోట్లను బాధితులకు తిరిగి చెల్లించేలా ఎంఆర్‌ఎం(మనీ రిస్టోరేషన్ మాడ్యూల్) తయారు చేసింది. రిఫండ్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఎంఆర్ఎం మాడ్యూల్ అమలులో తెలంగాణ దేశంలోని అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు.
ఈ మేరకు టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జీఆర్ఎం (గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం), సమన్వయ్ , సహయోగ్ వంటి ఇతర కీలక సైబర్ క్రైమ్ మాడ్యూళ్ల అమలులోనూ తెలంగాణ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోందని పేర్కొన్నారు. ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థ కూడా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమల్లో ఉందని వెల్లడించారు. నిర్ణీత పరిమితికి మించిన మొత్తంలో సైబర్ మోసాలు జరిగిన కేసుల్లో తెలంగాణ సైబర్ బ్యూరో ద్వారా జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఆటోమేటిక్‌గా నమోదు అయ్యే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా సైబర్ నేరాలపై వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు త్వరితగతిన న్యాయం, నష్టపోయిన నగదు రికవరీ మరింత సమర్థవంతంగా జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
