- సీఎం రేవంత్ చొరవతో 2024లో కర్తవ్యపథ్‌పై తెలంగాణ శకట ప్రదర్శన
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ కర్తవ్యపథ్‌పై సాగే వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనల్లో ఈసారి తెలంగాణకు చోటు దక్కలేదు. దీంతో రాష్ట్రాల ఔనత్యం, వారసత్వ సంపద, సంస్కృతిని చాటే ఈ వేడుకల్లో రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. శకటాలను ఎంపిక చేసే సెర్మోనియల్ కమిటీ తెలంగాణ శకట నమూనాను రెండో రౌండ్లోనే పక్కన పెట్టింది. అయితే, 2014 నుంచి 2026 వరకు.. మొత్తం 13 ఏండ్లలో కేవలం మూడు సార్లే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. తొలిసారి 2015లో ‘బోనాలు’ థీమ్‌తో రాష్ట్ర శకటం కర్తవ్యపథ్‌పై మెరిసింది. తర్వాత ఐదేండ్లకు (2020)లో మరోసారి బతుకమ్మ, వేయి స్తంభాల ఆలయం, మేడారం సమక్క–సారక్క జాతర రూపకంతో శకటం ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రత్యేకంగా తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. ‘అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష: తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం’ థీమ్ చాటుతూ అందే శ్రీ పాట బ్యాంక్ గ్రౌండ్ మారుమోగుతుండగా... 2024లో రాష్ట్ర శకటం ముందుకు సాగింది. అయితే, 2025లో మన శకటానికి అవకాశం దక్కలేదు. అయితే, ఎర్రకోటలో ఏర్పాటు చేసే భారత్ పర్వ్ లో అన్ని శకటాలతో పాటు... రాణి రుద్రమ, రామప్ప దేవాలయం థీమ్ తో ఏర్పాటు చేసిన తెలంగాణ శకటానికి అవకాశం ఇచ్చారు. ఈసారి సైతం రెండో రౌండ్ లోనే మన శకటాన్ని సెర్మోనియల్ కమిటీ తిరస్కరించింది. కాగా.. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీకి సైతం ఈ సారి అవకాశం దక్కలేదు.
30 శకటాల ప్రదర్శన
ఢిల్లీలోని కర్తవ్య పథ్ పై సాగే 77వ రిపబ్లిక్ డే పరేడ్ లో ఈసారి మొత్తం 30 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 17 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖల్లోని వివిధ విభాగాలు/త్రివిధ దళాలకు చెందిన 13 శకటాలు ఉన్నాయి. ఈ సారి స్వతంత్రత కా మంత్రం: వందేమాతరం, సమృద్ధి కా మంత్రం: ఆత్మ నిర్భర భారత్ అనే ఇతి వృత్తంతో శకటాలను ప్రదర్శిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈసారి అస్సాం, చత్తీస్ గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, పంజాబ్ శకటాలు ప్రదర్శించనున్నారు. అలాగే, త్రివిధ దళాలైన వైమానిక, సైనిక, నౌకదళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
