మున్సిపల్‌‌‌‌ తీర్పుతో విపక్షాల నోళ్లకు మూత .. రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి చేస్తాం

మున్సిపల్‌‌‌‌ తీర్పుతో విపక్షాల నోళ్లకు మూత .. రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి చేస్తాం
  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : ‘కాంగ్రెస్‌‌‌‌ పారదర్శక పాలన, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు నిదర్శనమే మున్సిపల్‌‌‌‌ ఎన్నికల విజయం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం మధిరలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌ కేవలం గ్రామీణ పార్టీ అని మాట్లాడిన వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌‌‌‌, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజార్టీ కట్టబెట్టారన్నారు.

 మున్సిపల్‌‌‌‌ ఎన్నికల తీర్పుతో విపక్షాల నోళ్లు మూతపడ్డాయని ఎద్దేవా చేశారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 

మధిర పట్టణాన్ని రాష్ట్రంలోనే రోల్‌‌‌‌మోడల్‌‌‌‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పదవులు చేపట్టాక రాజకీయం ఉండకూడదని, అభివృద్ధి నినాదనంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్‌‌‌‌ రాయల నాగేశ్వర్‌‌‌‌రావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు రామనాథం, మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ సామినేని సుజాత, వైస్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ కోన ధనికుమార్‌‌‌‌, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ బండారు నరసింహారావు, కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్‌‌‌‌, పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ పాల్గొన్నారు.