కరెంటు ఉద్యోగుల ఆందోళన బాట…

కరెంటు ఉద్యోగుల ఆందోళన బాట…

యాజమాన్యాలతో చర్చలు ఫెయిల్.. నేడు కార్పొరేట్ ఆఫీసు ఎదుట ధర్నా

హైదరాబాద్‌‌, వెలుగు: విద్యుత్‌‌ సంస్థల యాజమాన్యాలతో తెలంగాణ  ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌‌ యూనియన్‌‌ ఫ్రంట్‌‌ (టీటఫ్‌‌) చర్చలు విఫలమయ్యాయి. దీంతో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. బుధవారం హైదరాబాద్‌‌ మింట్‌‌కాంపౌండ్‌‌లోని  టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ కార్పొరేట్‌‌ ఆఫీసు వద్ద ఆందోళనకు టీటఫ్‌‌ పిలుపునిచ్చింది. 23 తర్వాత ఏరోజైనా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. హైదరాబాద్ లోని విద్యుత్‌‌ సౌధలో మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు చర్చలు జరిగాయి. ఆర్టిజన్ కార్మికులకు ఎపీఎస్‌‌ఈబీ రూల్స్ వర్తింపజేయడం కష్టమవుతుందని, న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని యాజమాన్యం చెప్పింది.  స్టాండింగ్ ఆర్డర్స్ ను వర్తింపచేస్తూ త్వరలో బేసిక్‌‌ వేతనంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

డీఏ స్థానంలో వీడీఏ పాయింట్లు, చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఇతర అంశాలను ఆలోచన చేద్దామని, టీటఫ్ నాయకత్వం సహకరించాలని యాజమాన్య ప్రతినిధులు ట్రాన్స్ కో జెఎండీ  శ్రీనివాస్ రావు, ఇతర డైరెక్టర్లు కోరారు. ఈపీఎఫ్‌‌ నుంచి జీపీఎఫ్‌‌ కు మార్చాలనే డిమాండ్‌‌ సీఎం , విద్యుత్‌‌ మంత్రితో సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. యాజమాన్యం సూచనలతో టీటఫ్‌‌ విభేదించింది. మరోసారి మింట్‌‌కాంపౌండ్‌‌లో సమావేశమైన టీటఫ్‌‌ నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. యాజమాన్య వైఖరి సరైనది కాదని, బుధవారం యథావిధిగా ధర్నా  చేపడతామన్నారు. ఈ ధర్నాకు ట్రాన్స్ కో, డిస్కమ్స్,  జెన్ కో  ఉద్యోగ, ఆర్టిజన్ కార్మికులు వేలాదిగా తరలిరావాలని టీటఫ్‌‌  చైర్మన్  ఎన్.పద్మా రెడ్డి, కన్వీనర్  ఇ. శ్రీధర్ లు పిలుపునిచ్చారు.

రెండు వర్గాలుగా విద్యుత్ ఉద్యోగులు

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యాలు జరిపిన చర్చలపై విద్యుత్‌‌ సంఘాలు రెండు వర్గాలుగా చీలాయి. యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 21 సంఘాల ఐక్యకార్యాచరణ ఫ్రంట్‌‌ టీటఫ్‌‌  ఉద్యమానికి సిద్ధమైంది. చర్చలు సఫలమైనట్లు టీఆర్‌‌ఎస్‌‌ అనుబంధ విభాగం టీఆర్‌‌వీకేఎస్‌‌  ప్రచారం చేస్తోంది. స్టాండింగ్ రూల్స్ అన్నింటికీ  పూర్తిగా సానుకూలంగా ఉన్నాయని టీఆర్‌‌వీకేఎస్‌‌  నేతలు ప్రకాశ్, కరెంట్‌‌ రావు, జాన్సన్‌‌ చెబుతుండగా, టీటఫ్‌‌  నేతలు పద్మారెడ్డి, శ్రీధర్‌‌ తదితర నేతలు స్టాండింగ్‌‌ రూల్స్‌‌ను  వ్యతిరేకిస్తున్నారు.