- 2వ పీఆర్సీ సిఫార్సులను 2023 జూన్ 1 నుంచే వర్తింపజేయాలి
- ఇంటర్ బోర్డు విలీనంలో బోధన, బోధనేతర ఉద్యోగుల సర్వీసు ప్రయోజనాలకు భరోసా ఇవ్వాలి
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించేందుకు తక్షణమే అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.
గతంలో సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మార్పు చేసే అంశంపై ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా కల్పించడం లేదని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలన్నదే ఉద్యోగుల ప్రధాన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
2వ పీఆర్సీ సిఫార్సులను 2023 జూన్ 1 నుంచే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియెట్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదనల నేపథ్యంలో బోర్డులో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల సర్వీసు ప్రయోజనాలు, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విలీనం వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు, ఇతర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
సామూహిక సెలవులపై సర్కార్ సీరియస్!
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం తలపెట్టిన సామూహిక సెలవు ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. మంగళవారం విధులకు గైర్హాజరై సామూహిక సెలవు తీసుకునే ఉద్యోగులు, టీచర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
పరిపాలనా వ్యవహారాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా విధులకు డుమ్మా కొట్టి సామూహిక సెలవు పేరుతో నిరసనల్లో పాల్గొనే వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారిక వర్గాలు హెచ్చరించాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మంగళవారం ఏ ఒక్క ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి సాధారణ సెలవులు మంజూరు చేయవద్దని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
