- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హెచ్చరిక
- ఓపీఎస్ సహా 42 డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్
- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉద్యోగుల సంకల్ప సభ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు పీఆర్సీ, పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూలేనివిధంగా స్వరాష్ట్రంలో పీఆర్సీ, డీఏలు ఏండ్ల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నించింది. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘ఉద్యోగుల సంకల్ప సభ’లో ప్రభుత్వంపై ఉద్యోగులు పోరుబాటను ప్రకటించారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే, ఈ సంకల్ప సభను పూర్తిస్థాయి హక్కుల సాధన సభగా మార్చి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ సహా ఉద్యోగులను వేధిస్తున్న మొత్తం 42 ప్రధాన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జేఏసీ కార్యాచరణ
ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు..
ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏల విషయంలో అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు లేని ఆర్థిక భారం, ఉద్యోగుల హక్కులైన డీఏ, వేతన సవరణ అమలు విషయానికే వచ్చేసరికి ఎలా తెరపైకి వస్తుందో ఉన్నతాధికారులు చెప్పాలని నిలదీశారు. గతేడాది జూన్ 2 నాటికే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, కొత్త వేతనాలను అమలు చేస్తామని సాక్ష్యాత్తు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా ఇంకా మోక్షం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాలతో అనేకసార్లు చర్చలు జరిపారని, ఆ చర్చల్లో ఇచ్చిన హామీలను మాత్రమే తాము అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకం దేశానికే ఆదర్శంగా ఉందని, అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఉద్యోగుల సమస్యలను పాలకులు మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం అన్యాయమని, రోడ్డున పడ్డ ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. జేఏసీ సెక్రటరీ జనరల్ రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ హక్కుల సాధనకు ప్రతిఒక్కరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఏండ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో జేఏసీ నేతలు ఎస్.రాములు, మహిపాల్‌రెడ్డి, బాణాల రాంరెడ్డి, నిర్మల, రాధ, గరికె ఉపేందర్‌రావు, దర్శన్‌గౌడ్, కృష్ణుడు, అబీబుద్దీన్, కుమార్, చంద్రశేఖర్‌గౌడ్, సైదులు, రమేశ్ పాక, వి.భిక్షం, పెంటయ్య, అరికెల వెంకటేశం, బాలస్వామి, ఫూల్‌సింగ్, మల్లేశ్, పులి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
