- ఈ ఏడాది 2.38 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్‌కు సన్నాహాలు
- ఇప్పటికే 65 వేల ఎకరాలకు పరిపాలనా అనుమతులు
- డ్రిప్ వైపు రైతుల అడుగులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గడం, ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయాన్ని నీటి పొదుపు దిశగా మళ్లించేందుకు సర్కారు డ్రిప్ ఇరిగేషన్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. సంప్రదాయ సాగు పద్ధతుల స్థానంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు అందించే ఆధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 2,38,750 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని టార్గెట్‌గా నిర్దేశించింది. దీనిలో భాగంగా 85 వేల ఎకరాలు ఆయిల్‌పామ్ తోటలకు, 1,53,750 ఎకరాలు ఇతర హార్టిక్చర్, వాణిజ్య పంటలకు కేటాయించారు. ఇప్పటికే 65,446 ఎకరాలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేయగా, వాటిలో 34,909 ఎకరాల్లో డ్రిప్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయింది. మరో 30,537 ఎకరాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
చిన్న, సన్నకారు రైతులే అధికం
రాష్ట్రంలో దాదాపు 91.33 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే. వీరిలో అధికశాతం మంది బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షలకు పైగా బోర్లు, వ్యవసాయ విద్యుత్ మోటార్లు వినియోగంలో ఉన్నాయి. భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాలంటే డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు సాంకేతికతలే శాశ్వత పరిష్కారమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో నీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అక్కడ అమలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ సాంకేతికతను అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి మొక్కకు అవసరమైనంత మేర నీరు అందించడంతో నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
గ్రామస్థాయిలో అవగాహన
ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణలో భాగంగా గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో అన్ని మైక్రో ఇరిగేషన్ కంపెనీలు పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. నీటి పొదుపు, డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని, హార్టికల్చర్ శాఖ అధికారులు వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదేశించింది. బెంచ్‌మార్క్ సర్వే (బీఎంఎస్), బిల్ ఆఫ్ క్వాంటిటీస్ (బీవోక్యూఎస్) పూర్తి చేసి పరిపాలనా అనుమతుల కోసం వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు అనుమతుల జారీ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
