హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టీచింగ్ హాస్పిటల్స్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రిమ్స్ సంస్థల్లో సేవలు అందిస్తున్న మొత్తం 16,871 మంది వివిధ కేటగిరీల ఉద్యోగుల సేవల కాలాన్ని మరో ఏడాది పాటు.. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. క్రమబద్ధీకరించిన రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు లేదా అవసరం ముగిసే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి.
ఇందులో 9,009 ఔట్ సోర్సింగ్, 4,801 కాంట్రాక్ట్, 3,056 ఆనరరియమ్ సేవలతో పాటు ఎంటీఎస్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. ఈ ఐదు సేవల పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండెంట్లు, క్లాస్-4 సిబ్బంది వంటి వేలాది మందికి దీని ద్వారా ఊరట లభించనుంది.
