శాఖల్లో లీకేజీలను అడ్డుకుంటే.. ప్రతినెలా 1,500 కోట్ల అదనపు రాబడి!

శాఖల్లో లీకేజీలను అడ్డుకుంటే.. ప్రతినెలా 1,500 కోట్ల అదనపు రాబడి!
  • అత్యధికంగా జీఎస్టీ విభాగంలోనే పన్ను ఎగవేతలు, అక్రమాలు
  • మైనింగ్, రవాణా, సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖల్లోనూ వివిధ రూపాల్లో ఆదాయానికి గండి
  • కొత్తగా ఏర్పాటు చేసే ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్ బాస్ పై ఐఏఎస్​ వర్గాల్లో  చర్చ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఖజానాకు ప్రస్తుతం పన్నుల రూపంలో ప్రతినెలా సగటున సుమారు రూ.12 వేల కోట్ల ఆదాయం సమకూరుతుండగా.. వివిధ శాఖల్లో జరుగుతున్న లీకేజీలను అడ్డుకుంటే అదనంగా మరో రూ.1,500 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జీఎస్టీ, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్​పోర్ట్, సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖలలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోందని పరిశీలనలో తేలింది.

ఇందులో అత్యధికంగా జీఎస్టీ విభాగంలోనే లీకేజీలు జరుగుతున్నట్టు అధికారిక వర్గాలు గుర్తించాయి. ఆయా శాఖలకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించి ఈ లీకేజీలను అరికట్టగలిగితే ఏడాదికి రూ. 18 వేల కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు సివిల్​సప్లైస్, మార్క్​ఫెడ్​వంటి సంస్థల్లో వడ్లు, ఇతర పంట ఉత్పత్తుల వేలం ఉంటుంది. వీటి టెండర్లలో ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా.. ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.

ఇలాంటివి కూడా అరికట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసమే స్పెషల్​ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటేరియెట్​వర్గాలు వెల్లడించాయి. దీనికి ఎవరిని బాస్ గా పెడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్​ను పెడతారా ? ఐపీఎస్​ను పెడతారా? అనేది తెలియాల్సి ఉన్నది. ఇటీవల సీఎంతో జరిగిన రివ్యూలో ఐపీఎస్​లే ఉండటంతో వారికే అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతున్నది. 

జీఎస్టీ విభాగంలోనే అత్యధిక లీకేజీలు.. నకిలీ ఇన్వాయిస్‌‌‌‌‌‌‌‌లు

రాష్ట్రంలో ఆదాయ లీకేజీలు అత్యధికంగా వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని జీఎస్టీ లోనే చోటుచేసుకుంటున్నాయి. నకిలీ బిల్లులు సృష్టించడం, సరుకు రవాణాలో ఈ-వే బిల్లులు సరిగా లేకుండా వ్యాపారం చేయడం, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) నిబంధనలను దుర్వినియోగం చేయడం ద్వారా కోట్లాది రూపాయల పన్నును ఎగవేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిధిలోని ఒక ప్లాస్టిక్ తయారీ సంస్థ ఉనికిలో లేని అనేక బోగస్ కంపెనీల పేర్లతో రూ. 80 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌‌‌‌‌‌‌‌లను సృష్టించి, ఎలాంటి సరుకు చేరవేయకుండానే రూ.14 కోట్ల మేర ఐటీసీ క్రెడిట్‌‌‌‌‌‌‌‌ను పొందినట్టు అధికారులు గుర్తించారు. సరిహద్దు దాటి వస్తున్న ఐరన్ స్క్రాప్ లారీలు మార్గం మధ్యలోనే దొంగ బిల్లులతో సరుకును దించేసి, ఈ-వే బిల్లులను రద్దు చేస్తూ పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నాయి. వ్యాపార సంస్థల ఆడిటింగ్ సక్రమంగా నిర్వహించకపోవడం, రిటర్న్ ఫైలింగ్ పర్యవేక్షణలో లోపాల వల్ల పన్ను రాబడికి విపరీతమైన గండి పడుతోంది.  

మైనింగ్‌‌‌‌‌‌‌‌.. ట్రాన్స్​పోర్ట్​లలో లీకేజీల లొసుగులు 

రాష్ట్రంలో మైనింగ్ శాఖ ద్వారా ప్రతి నెలా సగటున రూ.350 కోట్లకు పైనే ఆదాయం లభిస్తుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే మేజర్, మైనర్ మినరల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇసుక అమ్మకాల ద్వారా రూ. 925 కోట్ల రాబడి సమకూరింది. అయితే,  క్వారీల్లో అనుమతించిన పరిమితి కంటే అదనంగా ఖనిజాలను తవ్వితీసి అక్రమంగా రవాణా చేయడం, వే బిల్లుల్లో రవాణా పరిమాణాన్ని తగ్గించి చూపించడం వల్ల భారీగా రాయల్టీ ఆదాయం చేజారుతోంది. ఇసుక రీచ్‌‌‌‌‌‌‌‌లు,  స్టాక్ యార్డుల దగ్గర పక్కాగా సీసీ కెమెరాలు, వే-బ్రిడ్జిల పర్యవేక్షణ లేకపోవడం, చెక్ పోస్టుల వద్ద కన్నుగప్పి రాత్రివేళల్లో ఓవర్ లోడింగ్‌‌‌‌‌‌‌‌తో వెళ్లే లారీల వల్ల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతోంది. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులు, భారీ గూడ్స్ కంటైనర్లు పర్మిట్ ఫీజులు, పన్నులు చెల్లించకుండా నకిలీ పత్రాలతో సరిహద్దు దాటుతున్నాయి. అనుమతించిన బరువు కంటే 20 నుంచి 30 టన్నులు ఎక్కువగా సరుకు రవాణా చేస్తూ పట్టుబడకుండా సరిహద్దుల వద్ద తప్పించుకోవడం ద్వారా రోడ్డు పన్నులు, జరిమానాల రూపంలో రావాల్సిన ఆదాయం నష్టపోతోంది.

రిజిస్ట్రేషన్లలో అటు ఇటు చేస్తూ ఇలా 

భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అగ్రికల్చర్, నాన్​ అగ్రికల్చర్​ గా ఆస్తుల విలువను తక్కువగా చూపించడంతో స్టాంపుల శాఖలో భారీగా రాబడి తగ్గుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఒక వాణిజ్య విస్తరణ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయేతర భూమిని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల లొసుగులతో సాధారణ వ్యవసాయ భూమిగా నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.

దీంతో ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ. 2.5 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు లీకేజీ రూపంలో చేజారింది. అలాగే, ఓపెన్ ప్లాట్లను క్రమబద్ధీకరించకుండానే లేదా కన్వర్షన్ ఫీజులు చెల్లించకుండానే ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం తక్కువగా నమోదు అవుతోంది. మద్యం విక్రయాలకు సంబంధించి బెల్ట్ షాపులు నడపడం, మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ల్యాప్‌‌‌‌‌‌‌‌సింగ్, నాన్-డ్యూటీ పెయిడ్  మద్యాన్ని ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి అక్రమంగా తరలించడం ప్రధాన లీకేజీలుగా మారాయి.  

ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ల పర్యవేక్షణపై ‘సూపర్ కాప్’ పెత్తనమేల 

మరోవైపు ఆయా శాఖల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు ఇప్పటికే అంతర్గత విభాగాలు, విజిలెన్స్ విభాగాలు పనిచేస్తున్నప్పటికీ, వాటిని మరింత బలోపేతం చేయకుండా అన్ని శాఖలపైనా పెత్తనం చెలాయించేలా డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి నేతృత్వంలో వింగ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎస్​ అధికారిని పెడితే ఇబ్బందులు వస్తాయనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో వివిధ శాఖలకు అధిపతులుగా (హెచ్‌‌‌‌‌‌‌‌ఓడీలుగా) సీనియర్ ఐఏఎస్ అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. తమ పరిధిలోని శాఖ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పన్ను లీకేజీలు, అక్రమాలపై ఆయా హెచ్‌‌‌‌‌‌‌‌ఓడీలే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

సీనియర్​ ఐఏఎస్ అధికారులపై ఒక ఐపీఎస్ అధికారిని ‘సూపర్ కాప్’గా నియమించడం వల్ల రెండు కీలక వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరుకు దారితీస్తుందని, ఐఏఎస్, -ఐపీఎస్ అధికారుల మధ్య పూడ్చలేని గ్యాప్ పెరుగుతుందని సెక్రటేరియెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్షేత్రస్థాయి సమన్వయం లోపించి, శాఖాధిపతుల నిర్ణయాధికారం దెబ్బతింటే అది పరోక్షంగా పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ఫలితంగా లీకేజీలు తగ్గడం దేవుడెరుగు.. రావాల్సిన సాధారణ ఆదాయానికే గండిపడే ప్రమాదం ఉందని సచివాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.