యాసంగికి దొడ్డు రకాలే.. సన్న వడ్లు వేయబోమంటున్న రైతులు

యాసంగికి దొడ్డు రకాలే..  సన్న వడ్లు వేయబోమంటున్న రైతులు

వానాకాలం సన్నొడ్లు సాగు చేసి ఆగమైన రైతులంతా ఈ యాసంగిలో ఎప్పట్లాగే దొడ్డు వడ్లు పెడుతున్నారు. వివిధ ప్రాజెక్టులు, చెరువుల కింద దొడ్డు వడ్లతో నార్లు పోసుకుంటున్నారు.  వానాకాలం సర్కారు మాటలు నమ్మి సన్నవడ్లు సాగుచేసిన రైతులు నిండా మునిగారు. దొడ్డు వడ్లతో పోలిస్తే సన్న వడ్ల దిగుబడులు తగ్గడంతోపాటు పెట్టుబడులు ఎక్కువయ్యాయి. తీరా ఐకేపీ సెంటర్లలో ఎవరూ కొనట్లేదు. రేటు పెంచుతామని సీఎం చెప్పినా ఇప్పటికీ పెంచలేదు. దీంతో యాసంగిలో సన్నవడ్లు సాగు చేయొద్దని నిర్ణయించుకున్నారు.

జగిత్యాల/వరంగల్​రూరల్, వెలుగు: పోయిన వానాకాలం సీజన్​లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, సర్కారు చెప్పిందని  రైతులు సుమారు 29 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ మసూరి లాంటి సన్నాలు వేశారు. కానీ ఆగస్టు, అక్టోబర్​ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, చీడపీడల కారణంగా నష్టపోయారు. దొడ్డు రకాలతో పోలిస్తే సన్నరకాలపై ఒక్కో ఎకరాకు పెస్టిసైడ్స్​ రూపంలో  రూ.10 వేల వరకు అదనంగా ఖర్చు చేశారు. తీరా చూస్తే దొడ్డు రకాల కంటే  ప్రతి ఎకరాకు సగటున 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తక్కువగా వచ్చింది. దీంతో సుమారు ఒక్కో ఎకరాపై రూ.20వేలకు పైగా నష్టపోయామని, క్వింటాల్​కు రూ.2,500 చొప్పున కొని ఆదుకోవాలని డిమాండ్ చేసినా సర్కారు పట్టించుకోలేదు.

సీఎం హామీ ఇచ్చినా..

రాష్ట్రవ్యాప్తంగా సన్నాలు పండించిన రైతులు ఆందోళన చేయడంతో అక్టోబర్ 31న జనగామ జిల్లా కొడకండ్ల రైతు సభలో సీఎం  సన్నవడ్లకు 100 గానీ, 150 గానీ అదనంగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి దీనిపై  ఎలాంటి గైడ్​లైన్స్ రాలేదు. జిల్లాల్లో ఏర్పాటుచేసిన ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ సెంటర్లలో దొడ్డు రకాలను  ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేస్తున్నా సన్నాలను మాత్రం రకరకాల కొర్రీలతో కొనట్లేదు. మిల్లులకు తీసుకెళ్తే అడ్డికి పావుశేరు అడుగుతున్నారు. దొడ్డు వడ్లను క్వింటాల్​కు రూ.1,880 మద్దతు ధర చొప్పున సర్కారే కొంటుంటే సన్నవడ్లకు మిల్లర్లు రూ.1,600 నుంచి రూ.1,700 చొప్పున చెల్లిస్తున్నారు.

ఈసారి 45 లక్షల ఎకరాల్లో..

రాష్ట్రవ్యాప్తంగా రైతులు వివిధ ప్రాజెక్టులు, చెరువుల కింద యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్​లో సుమారు 45లక్షల ఎకరాల్లో వరి సాగుచేసే చాన్స్​ ఉందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కానీ వానాకాలం అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సన్నవడ్లు పెట్టవద్దని రైతులు నిర్ణయించుకుంటున్నారు. ఈక్రమంలో ఎస్సారెస్సీ ఆయకట్టు పరిధిలో దొడ్డువడ్లనే నార్లు పోసుకుంటున్నారు. అదీగాక  రాష్ట్ర ప్రభుత్వం ఈసారి షరతుల సాగు కింద ఏయే పంటలు వేయాలో ఇప్పటికైతే సూచించలేదు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్డర్స్​ రాలేదని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం ఏదేమైనా దొడ్డు రకం వడ్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు. వ్యాపారుల వద్ద అవే సీడ్​కొంటున్నారు.

మా ఊళ్లో దొడ్డు వడ్లే పెడ్తున్నం

వానాకాలం సర్కారు చెప్పిందని సన్నవడ్లు పెట్టి నష్టపోయినం.  మూడెకరాల్లో సాగుచేస్తే దిగుబడి సగానికి సగం తగ్గింది. పురుగుల మందులకు బాగా ఖర్చుపెట్టినం.  తీరా వడ్లను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడ్డం. అందుకే ఈసారి మా ఊరోళ్లంతా మళ్లీ దొడ్డు రకం వడ్లు సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నం. – లింగమూర్తి, వంగపహాడ్‍, వరంగల్‍

సన్నడ్లతో నష్టపోయినం

సర్కారు చెప్పిందని వానాకాలం సన్న వడ్లు పెట్టినం. చీడపీడలతో నాలుగైదుసార్లు పురుగు మందులు కొట్టాల్సి వచ్చింది. దొడ్డు వడ్లతో పోలిస్తే దిగుబడి సగం కూడా రాలే. సన్నవడ్లకు రేటు పెంచుతమన్న సీఎం మళ్లీ పట్టించుకోలే. సన్నాలను కొనేటోళ్లు కూడా లేకుండా పోయిన్రు. అందుకే యాసంగి లో దొడ్డు వడ్లు నారుపోసిన. – తిరుపతి రెడ్డి, జగిత్యాల

దొడ్డు వడ్లే నారు పోసిన

ప్రభుత్వం చెప్పిందని వానాకాలం సన్నవడ్లు పెట్టి నిండా మునిగినం. అప్పుడు చెప్పిన ఆఫీసర్లు ఇప్పుడు వస్తలేరు. ఇప్పటివరకైతే ఇవి పెట్టండి, అవి పెట్టండి అని చెప్తలేరు. సన్నవడ్లను కొంటలేరు.  అందుకే ఈసారి దొడ్డు వడ్లే నారుపోసిన. – మల్లేశం, ధర్మారం, జగిత్యాల