సర్కారు వద్దన్నా.. వడ్లు అలుకుతున్నారు

సర్కారు వద్దన్నా.. వడ్లు అలుకుతున్నారు

పెద్దపల్లి ​, వెలుగు: యాసంగిలో వరి సాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా రైతులు మాత్రం వరివైపే మొగ్గుచూపుతున్నారు. తమ భూముల్లో వరి తప్ప వేరే పంటలు పండవని వడ్లు అలుక్కుంటున్నారు. ఓవైపు అదును దాటుతున్నా పంటల సాగు, మద్దతు ధరలు, మార్కెటింగ్​పై సర్కారు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు.  కనీసం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో రైతులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఎప్పట్లాగే ఎస్సారెస్పీ కింద జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్​ జిల్లాల్లో వరి కోతలు పూర్తయిన పొలాల్లో నార్లు పోసుకుంటున్నారు. ఎస్సారెస్పీ కింద కొన్నేండ్లుగా వరి వేయడం వల్ల భూములన్నీ జాలుపట్టాయని, సర్కారు ఉన్నఫలంగా వరి వద్దంటే ఇప్పటికిప్పుడు వేరే పంటలు వేయలేమని రైతులు చెప్తున్నారు. వారబందీ పద్ధతిలో నీళ్లిచ్చినా బోర్లతో గట్టెక్కాలనే ప్లాన్​లో ఉన్నారు. కాకపోతే దొడ్డు వడ్లకు బదులు సన్నవడ్లు పెడుతున్నారు. పండాక ఒకవేళ సర్కారు కొనకపోతే ఎలాగూ సన్నవడ్లే కనుక బయట అమ్ముకుంటామని చెప్తున్నారు. 

ఎస్సారెస్పీ కింద 1‌0 లక్షల ఎకరాల్లో..!
రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం వరి కోతలు ఇప్పటికే పూర్తయ్యాయి. అందరికంటే ముందు ఎస్సారెస్పీ, నాగర్జున సాగర్​ఆయకట్టు పరిధిలోని జిల్లాల్లో నెల కిందట్నే రైతులు వరి కోసి వడ్లను కల్లాలకు తరలించారు. కిందటేడాది యాసంగిలో ఇరిగేషన్​ ప్రాజెక్టులతో పాటు చెరువుల కింద సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. బోర్లు, బావుల కింద మరో 20 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు.  ఈసారి కూడా అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండడంతో ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ప్రస్తుత యాసంగిలోనూ సుమారు 55 లక్షల నుంచి 60 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. కానీ సర్కారు వరి వేయద్దనడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆలోచనలో పడినప్పటికీ ఎస్సారెస్పీ కింద మాత్రం వరినార్లు పోసుకుంటున్నారు. సర్కారు ఎంత చెప్పినప్పటికీ శ్రీరాంసాగర్​ ఆయకట్టు కింద సుమారు 10 లక్షల ఎకరాల్లో వరిసాగయ్యే అవకాశముందని ఆఫీసర్లు కూడా అంటున్నారు. సహజంగా యాసంగి వరినార్లు అనురాధ కార్తెలో పోసుకొని డిసెంబర్​ 29 లోగా నాట్లు పూర్తిచేస్తారు. నవంబర్​20న మొదలయ్యే ఈ కార్తె డిసెంబర్​3 తో ముగుస్తుంది. త్వరలోనే కార్తె ముగియనుండగా.. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో వేలాది రైతులు వరినార్లు పోసే పనిలో బిజీగా మారారు.

కావాల్సినన్ని నీళ్లు ఉన్నందునే..
యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయవద్దంటున్న రాష్ట్ర సర్కారు.. ప్రాజెక్టుల కింద  వారబందీ  పద్ధతిలో కేవలం వేరే పంటలకు మాత్రమే నీళ్లు ఇస్తామని చెప్తోంది. కానీ ఎస్సారెస్పీతో పాటు వివిధ ప్రాజెక్టుల కింద వారబందీ పద్ధతిలో నీళ్లిచ్చినా వరిసాగుకు డోకా ఉండదని రైతులు అంటున్నారు. ఈ యేడాది కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, బోర్లు, బావుల్లో కావాల్సినంత నీళ్లు ఉండడమే ఇందుకు కారణం. ఒక వారం కాలువ నీళ్లు వచ్చినా మరో వారం బోర్లను నడిపిస్తే పంట చేతికి వస్తుందనే ఆలోచనతో ఉన్నారు. అందుకే వరి సాగు వద్దని సర్కార్​ చెప్తున్నా చాలా మంది రైతులు నార్లు పోసుకుంటున్నారు. బాయిల్డ్​ రైస్​కు డిమాండ్​ పడిపోయినందున దొడ్డు వడ్ల కంటే సన్నవడ్లకు మొగ్గుచూపుతున్నారు. యాసంగిలో గతంలో కేఎన్ఎం 118, ఎంటీయూ1290, జేజీఎల్​24423 రకాలు సాగుచేసేవారు. ఈసారి యాసంగికి అనుకూలంగా ఉండే కేఎన్​ఎం 1638 రకాన్ని ఎంచుకుంటున్నారని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. ఒకవేళ పంట వచ్చాక సర్కారు కొనకుంటే ఎలాగూ సన్నవడ్లే కనుక బయట అమ్ముకుంటామని రైతులు చెప్తున్నారు.

భూమిని పడావు పెట్టలేకే.. 
సర్కారేమో వరి వేయొద్దంటున్నది. కానీ ఎస్సారెస్పీ ఆయకట్టు భూముల్లో వరి తప్ప వేరే పంటలు పండయ్​.  వర్షాలు మంచిగా పడ్డందుకు  భూములన్నీ జాలువట్టి ఉన్నయ్​. వరి వద్దంటే భూమిని పడావు పెట్టాల్సిందే. భూమిని పడావు పెడితే మేమెట్ల బతకాలె? ఇప్పటికే చాలా లేటయింది. ఎట్లయితే అట్లయితదని మొలక అలుకుతున్నం.  
- చదువు లింగారెడ్డి,