కేసీఆర్ బంద్ కు పిలుపునివ్వడం సిగ్గు చేటు

కేసీఆర్ బంద్ కు పిలుపునివ్వడం సిగ్గు చేటు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

న్యూఢిల్లీ: రేపు తలపెట్టిన భారత్ బంద్ కు తెలంగాణ రైతులు సహకరించవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఎంఎస్పి విషయంలో చట్టం రాబోతుందని ఆయన వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కృత్రిమ ఉద్యమాలు మానుకోవాలని సూచించారు. కేసీఆర్ వైఖరి పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుందని..  జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎందుకు చట్టాలను వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులకు మంచి జరిగే చట్టాలను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని.. ఆరేళ్లలో వడగండ్ల వాన, వర్షాల వల్ల రైతులు నష్టపోయినా రైతులను కేసీఆర్ ఆదుకోలేదని విమర్శించారు. ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలను ఎవరు మర్చిపోలేదన్నారు. సన్న వడ్లు వేయమని కేసీఆర్ చెప్పారు.. అయితే  కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డు వడ్లు పండించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ పండించిన పంటకు ఆయనే ధర నిర్ణయించుకుంటారు..రైతులు మాత్రం తమ ధరను నిర్ణయించుకోకూడదా అని ప్రశ్నించారు. 40 లక్షల ఎకరాల సాగు భూమిలో 30 లక్షల ఎకరాల్లో సన్న రకం వడ్లు వేశారని ఆయన వివరించారు. కేసీఆర్ బంద్ కు పిలుపువ్వడం సిగ్గు చేటన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఒక్క నిరసన జరగలేదన్నారు..  వ్యవసాయ చట్టాలు మంచివని వైఖరి మార్చుకోమని 3 లక్షల మంది కేసీఆర్ కు లేఖ రాశారని, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. సన్న వడ్లు పండించిన వారికి బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే బంద్ టిఆర్ఎస్ బంద్ మాత్రమేనని బండి సంజయ్ పేర్కొన్నారు.