కాంగ్రెస్లోకి విజయశాంతి?

కాంగ్రెస్లోకి విజయశాంతి?
  • అధిష్టానంతో సంప్రదింపులు పూర్తి
  • మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఒప్పందం
  • కొంత కాలంగా పార్టీ యాక్టివిటీస్ కు దూరం
  • పోరాటా కమిటీ చైర్ పర్సన్ ను చేసిన బీజేపీ
  • రెండు జాబితాల్లోనూ ఆమెకు దక్కని చోటు


హైదరాబాద్: తెలంగాణ ఫైర్‌ బ్రాండ్‌ విజయశాంతి పార్టీ మారనున్నారని సమాచారం. ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. బీజేపీలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటిముట్టన్నట్లు ఉంటున్నారు. బీజేపీ రెండు జాబితాల్లోనూ ఆమె పేరు లేదు. అయితే పార్టీ తీరుపై పలుసార్లు ఆమె బహిరంగ విమర్శలు సైతం చేశారు. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు సైతం పార్టీ మారుతారనేందుకు బలం చేకూర్చాయి.

బీఆర్ఎస్పై కాంగ్రెస్ లోకి వచ్చి పోరాడాలని కొందరు.. బీజేపీలోనే ఉండాలని మరింకొందరు కోరుతున్నారని.. కానీ తాను ఒక పార్టీ కోసం మాత్రమే పనిచేయగలని ఇటీవల విజయశాంతి ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ సైతం ఆమెను సొంతగూటికి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ క్రమంలో విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంతో చర్చలు పూర్తవడంతో త్వరలోనే  కాంగ్రెస్  కండువా కప్పుకొనే అవకాశం ఉంది. ఆమెకు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.  ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లు రవి ధ్రువీకరించారు.