V6 News

పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇలా కోర్సు పూర్తికాగానే అలా కొలువు

పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇలా కోర్సు పూర్తికాగానే అలా కొలువు
  •     పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ మార్పు
  •     మే 11న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ ఒప్పందాలు
  •     టీ-హబ్‌‌‌‌‌‌‌‌లో ‘ఇండస్ట్రీ- అకాడెమియా’ మీటింగ్​లో కమిషనర్ శ్రీదేవసేన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు కోర్సు పూర్తికాగానే ఉద్యోగం వచ్చేలా నైపుణ్యాధారిత విద్యను అందించడమే సర్కారు లక్ష్యమని కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. బుధవారం మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని టీ-హబ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘పరిశ్రమలు, -అకాడమిక్ అనుసంధానం’ పై నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిప్లొమా నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతీ విద్యార్థిని గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన మానవ వనరుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక దృక్పథంతో ఉన్నారని పేర్కొన్నారు. 

ఇకపై విద్యార్థులకు కోర్సులో భాగంగానే నేరుగా పరిశ్రమల్లో అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌షిప్, ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం సిలబస్  రీ-డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో చదువు పూర్తి కాగానే మెరుగైన ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్స్ దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మే 11న నిర్వహించే  విద్యా వారోత్సవాల సందర్భంగా సీఎం సమక్షంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ఇండస్ట్రీ నిపుణులే ప్రొఫెసర్లు.. 

కేవలం థియరీ కాకుండా ప్రాక్టికల్ నైపుణ్యాల కోసం పరిశ్రమల విషయ నిపుణులను ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’గా కాలేజీలకు ఆహ్వానించనున్నట్లు శ్రీదేవసేన తెలిపారు. వారు విద్యార్థులకు నేరుగా క్లాసులు, సదస్సులు నిర్వహిస్తారన్నారు. లెక్చరర్లకూ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. సమావేశంలో ఏఐ , మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ వంటి ఎమర్జింగ్ రంగాల్లో భాగస్వామ్యాలపై కీలక చర్చలు జరిపారు. ఇండస్ట్రీస్ జేడీ మధుకర్ బాబు, అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌షిప్ బోర్డు డైరెక్టర్ పాండే, నిథిమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట రమణ, ఐజీబీసీ ప్రతినిధి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.