- రూ.13 వేల కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధం
- బ్యాంకుల్లో ఎస్క్రో ఖాతాల ఏర్పాటుపై అధికారుల ప్రత్యేక దృష్టి
- ముంబైలో ఆర్ అండ్ బీ, ఆర్బీఐ అధికారులతో చర్చలు సఫలం
- త్వరలోనే నిర్మాణ పనులు
హైదరాబాద్, వెలుగు: హ్యామ్ ప్రాజెక్టులో వర్క్ అపాయింటెడ్ డేట్ ఆర్డర్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థలన్నీ ఆర్డర్ చేతికి అందిన తర్వాతే క్షేత్రస్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో ఆర్అండ్బీ పరిధిలో హ్యామ్ రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ అంగీకారంతో తమ సంస్థల పేరుతో ఎస్క్రో బ్యాంకు ఖాతాలను తెరిచే పనిలో కాంట్రాక్టర్లు నిమగ్నమయ్యారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించే 40 శాతం నిధులు, బ్యాంకు లోన్ ఇచ్చే 60 శాతం డబ్బు ఈ ఖాతాలోకి మళ్లిస్తారు. దీంతో అధికారులంతా ఈ ఎస్క్రో ఖాతాలపై దృష్టి సారించారు. ఇటీవల ముంబైలో ఆర్అండ్బీ శాఖ ఉన్నతాధికారులు ఆర్బీఐ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. త్వరలోనే రూ.13 వేల కోట్లతో క్షేత్రస్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి.
ఆర్బీఐ అధికారులతో చర్చలు సఫలం..
హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వీలుగా ఆర్బీఐ భరోసా ఇచ్చింది. రూ.13 వేల కోట్ల పనులకు సంబంధించి అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద 10 శాతం, పని కాలంలో 30 శాతం, 15 ఏండ్ల కాలపరిమితితో మిగతా 60 శాతం బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం ఆర్బీఐ సహకారం తీసుకుంది. కాంట్రాక్టర్ల పెట్టుబడికి రక్షణగా ప్రభుత్వం మారినా, మారకపోయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా బిల్లుల చెల్లింపునకు ఢోకా లేకుండా త్రీ-టైర్ విధానాన్ని తీసుకొచ్చింది. భారీ రోడ్డు మౌలిక వసతుల రంగాన్ని గాడిన పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ షరతులన్నింటికీ లోబడి స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తూ అంగీకారం తెలిపింది.
మొదటి దశలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు బిల్లులు చెల్లిస్తాయి. అక్కడ ఆలస్యమైతే ప్రత్యేకంగా సృష్టించిన పేమెంట్ సెక్యూరిటీ ఫండ్ నుంచి ఇస్తారు. అక్కడ కూడా నిధులు రాకపోతే ఆర్బీఐ నేరుగా రాష్ట్ర నిధుల నుంచి కోత విధించి కాంట్రాక్టర్లకు ఇచ్చేలా ‘డెడికేటెడ్ డెబిట్ మెకానిజం’కు ఆమోదం తెలుపుతూ ఆర్బీఐకి ప్రభుత్వం అంగీకార పత్రం రాసిచ్చింది. డైరెక్ట్ డెబిట్ రైట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో విఫలమైతే, ఆర్బీఐ నేరుగా రంగంలోకి దిగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు లేదా ఆర్బీఐ వద్ద ఉండే రాష్ట్ర ప్రభుత్వ ఖాతా, బ్యాంకు రుణాల నుంచి ఆ మొత్తాన్ని నేరుగా మినహాయించుకుని కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది.
ఆర్డర్స్ రాగానే పనులు షురూ..
ఏదైనా పెద్ద ప్రాజెక్టులో పనులు అధికారికంగా ప్రారంభించడానికి ప్రభుత్వం ఇచ్చే తుది అనుమతి ఉత్తర్వులనే ‘వర్క్ అపాయింటెడ్ డేట్ ఆర్డర్స్’ అంటారు. టెండర్ ఖరారై, వర్క్ అగ్రిమెంట్ జరిగిన వెంటనే ఈ ఆర్డర్ ఇవ్వరు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ ఇద్దరూ తమ ముందస్తు బాధ్యతలను పూర్తి చేశాక ఈ ఆర్డర్ జారీ అవుతుంది. రోడ్ల నిర్మాణానికి ఎక్కడైనా భూసేకరణ అవసరమైతే అందులో 80 శాతం భూసేకరణ పూర్తి చేయడంతోపాటు, అటవీ, పర్యావరణ శాఖల అనుమతులను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ బ్యాంకులతో మాట్లాడి ప్రాజెక్టుకు అవసరమైన 60 శాతం నిధులను సిద్ధం చేసుకోవాలి. దీనినే ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు. ఈ 2 పనులు పూర్తయ్యాక ప్రభుత్వం అపాయింటెడ్ డేట్ ఆర్డర్ ఇస్తుంది. ఇది వచ్చిన రోజు నుంచే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గడువులు లెక్కించబడతాయి.
త్వరలో రోడ్ల పనులు స్టార్ట్ చేస్తాం..
కాంట్రాక్ట్ సంస్థలకు వర్క్ అపాయింటెడ్ డేట్ ఆర్డర్స్ జారీ చేసే పనిలో ఉన్నాం. దీనిపై ప్రభుత్వం, ఆర్బీఐ, కాంట్రాక్ట్ ఏజెన్సీల మధ్య కొన్ని ఒప్పందాలు జరగాల్సి ఉన్నాయి. ప్రభుత్వం, కాంట్రాక్టు పొందిన ఏజెన్సీల మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. త్వరలో రోడ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తాం.
- వెంకటేశ్వర్ రావు, హ్యామ్ ప్రాజెక్ట్ ఈఎన్సీ, ఆర్అండ్బీ శాఖ
