హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల 4 డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు ఇచ్చినా ఉపయోగం లేదని, సంస్థకు రూ.2,209 కోట్ల వరకూ తప్పనిసరి చెల్లింపులతోపాటు భారీ మొత్తంలో నష్టాలు ఉన్నాయని, రూ.47 కోట్లు ఇస్తే సమస్యలు పరిష్కారం కావని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. గతంలో ఆర్టీసీ పరిరక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల దృష్ట్యా బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు చేయలేక పోతున్నామని పేర్కొంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై యూనియన్లు పట్టుపడుతున్నాయని, అమలు కాని ఈ డిమాండ్‌తో ఇకపై చర్చలు జరిపినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ అప్పులు, చేయాల్సిన చెల్లింపుల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదివారం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించినందుకు ఆయన హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు సూచనల మేరకు యూనియన్ల డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నించామని, ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి యూనియన్ల బాధ్యతారాహిత్యం కూడా ఉందన్నారు.
ఉద్యోగులకే రూ.1,521.25 కోట్లు చెల్లించాల్సివుందని వివరించారు. ఇవిగాక ఈ ఆగస్టు నాటికి సంస్థ నష్టాలు రూ.5,269.25 కోట్లు ఉన్నాయన్నారు. ఇలాగే నష్టాలతో సంస్థను నడిపితే రూ.1,786.81 కోట్ల రుణాలను ఎలా చెల్లించాలన్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 2,609 కాలం చెల్లిన బస్సులను మార్చాల్సి ఉందని, దీనికి అత్యవసరంగా రూ.750 కోట్లు అవసరమని, 2020 మార్చి నాటికి మరో 476 బస్సులను మార్చాల్సి ఉందని తెలిపారు.

