భూముల కేటాయింపులో రాష్ట్ర సర్కారు వివక్ష

 భూముల కేటాయింపులో రాష్ట్ర సర్కారు వివక్ష
  • టీఆర్ఎస్​ ఆఫీసు​లకు, అమ్మేందుకు భూములు
  • సైన్స్ సిటీ, సైనిక్ స్కూల్​కు స్థలం ఇస్తలేదు
  • గిరిజన వర్సిటీ, కేవీలకు ఇవ్వడంలోనూ జాప్యం
  • ఏండ్లుగా ఆగిన కేంద్ర ప్రాజెక్టులు

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు, ప్రైవేట్ కంపెనీలకు, అర్రాస్​పెట్టి అమ్ముకొని ఖజానా నింపుకునేందుకు దొరుకుతున్న భూములు కొన్ని ప్రజోపయోగ, ముఖ్యమైన ప్రాజెక్టులకు ఇచ్చేందుకు మాత్రం రాష్ట్ర సర్కార్​కు దొరుకుతలేవు. దీంతో సైన్స్ సిటీ, సైనిక్ స్కూల్, రైల్వే టెర్మినల్స్, డ్రైపోర్ట్, మంచిర్యాలలో కేంద్రీయ విద్యాలయం వంటి ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. భూములు సేకరించి అప్పగించకపోడంతోనే ఆలస్యమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏండ్ల కిందటే కేంద్రం నుంచి మంజూరైన అనేక ప్రాజెక్టులు తిరిగి వెనక్కి వె ళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. వేల ఎకరాలు రాష్ట్ర సర్కా ర్ వివిధ ప్రైవేట్ కంపెనీలు, ఇండస్ట్రీలకు కట్టబెడుతోంది కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు మాత్రం ఇస్తలేదు.

సైన్స్ సిటీ.. సైనిక్ స్కూలుకు జాగా లేదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సైన్స్ సిటీ ఏర్పాటవుతుంది. సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలం దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. దీనికి డిసెంబరు లోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.232.70 కోట్లు. ఇంతవరకూ రాష్ట్ర ప్రభు త్వం స్థలం కేటాయించలేదని తెలిసింది. సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రపోజల్స్ పంపాలని కోరినప్పటి కీ అరకొరగా వివరాలిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో సైనిక్ స్కూల్​ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిపై ప్రతిపాదనలు పంపాలని కోరినా రాష్ట్ర సర్కార్ వివరాలివ్వలేదు. వరంగల్​లో మామునూరు విమానాశ్రయానికి 400 ఎకరాల స్థలం సేకరించడంపైనా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఎయిర్​పోర్ట్​ ఏర్పాటు ఆలస్యమవుతోంది.

డ్రై ఫోర్ట్.. సెంట్రల్, ట్రైబల్ వర్సిటీలకూ..

రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో డ్రై పోర్ట్ ఇస్తామని రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో కేంద్రం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలో ఏర్పాటు చేయాలని అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. అయితే ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఒకసారి, మహబూబ్ నగర్ జిల్లాలో అని మరోసారి, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అని ఇలా స్థలం కేటాయింపుపై పూటకోసారి రాష్ట్ర సర్కార్ మాట మార్చింది. దీంతో డ్రైపోర్టు అంశం ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయింది. డ్రైపోర్ట్ అందుబాటులోకి వస్తే 5 వేల మందికిపైగా ఉపాధి దొరుకుతుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు కేంద్రీయ విద్యాలయం(కేవీ) మంజూరు చేసింది. తాత్కాలికంగా కిరాయి బంగ్లాలో స్కూల్ స్టార్ట్ చేశారు. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం జాగా ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీకి 335 ఎకరాలు అవసరం కాగా సగమే హ్యాండోవర్ చేసింది. మిగతా విస్తీర్ణం ఇంకా ఇవ్వలేదు. దీంతో టెంపరరీ బిల్డింగ్స్ ఏర్పాటు అయినా.. అడ్మిషన్స్ మొదలుకాలేదు. నాగులపల్లి వద్ద టెర్మినల్ కోసం 100 ఎకరాలు భూమి కావాలని రైల్వే కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది.

నచ్చిన వాటికి వేల ఎకరాలు

ఖాజానా నింపుకునేందుకు వెంట, వెంటనే సర్కార్ భూములను గుర్తించి అమ్ముకుంటున్న రాష్ట్ర సర్కార్, అదే ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంతో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. భూములు అమ్మాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఎక్కడెక్కడ సర్కార్ భూములు ఉన్నాయనే దానిపై పూర్తి వివరాలు తెప్పించుకుంది. ఇప్పటికే దాదాపు మూడు వేల ఎకరాల పైన గుర్తించారు. ఇందులో కొన్ని భూములు ఇప్పటికే అమ్మివేయగా, మరికొన్ని అమ్మకానికి రెడీగా ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీకి జిల్లాల్లో ఎకరం లోపు స్థలం గజం వంద రూపాయలకే ఇచ్చేసింది..ఇప్పటికే 24 జిల్లాల్లో 18.5 ఎకరాల భూమిని రూ.89 లక్షలకే టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుంది. టీఆర్ఎస్ నాయకులు పార్టీ ఆఫీసులకు స్థలాలు కావాలని అర్జీ పెట్టుకోవడం, సర్కార్ వెంటనే స్థలాలు కేటాయించడం జరిగిపోయింది. ఇక హైదరాబాద్ పార్టీ ఆఫీస్కు బంజారాహిల్స్​లో రూ.100 కోట్ల విలువైన 4935 గజాల స్థలం ప్రభుత్వం ఇచ్చింది. ఇక రాష్ట్రంలో ఫార్మాసిటీకి 19 వేల ఎకరాలు, వివిధ రకాల ఇండస్ట్రీలకు మరో 20 వేల ఎకరాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది.