- ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: బంజారాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బంజారాల సమస్యల పరిష్కారం కోసం మహా సేవా సంఘ్ వ్యవస్థాపకుడు రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో గురువారం జంతర్ మంతర్ లో బంజారా నగారా నిర్వహించారు.
ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున బంజారా బిడ్డలతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దంపతులు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా14 కోట్ల మంది బంజారాలు ఉంటే... ఒక్కో రాష్ట్రంలో వారిని ఒక్కో సామాజిక వర్గంగా గుర్తిస్తున్నారని తెలిపారు.
అందువల్ల బంజారాలందరిని ఒకే వర్గంగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే బంజారా, సుగాలీలు మాట్లాడే గోర్ బోలి భాషకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని కోరారు.
