సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. పండగ బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్

సింగరేణి  కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. పండగ బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండగను పురస్కరించుకుని కార్మికులకు బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది సింగరేణికి వచ్చిన రూ.2,360 కోట్ల లాభాల్లో 34 శాతం వాటా అంటే రూ.810 కోట్లు కార్మికులకు బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో రెగ్యులర్ కార్మికులకు లక్షా 95 వేల 610 రూపాయలు (1, 95, 610), కాంట్రాక్ట్ వర్కర్స్‎కు రూ.5 వేల 500 బోనస్‎గా అందించనుంది ప్రభుత్వం.

పండగ బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సింగరేణి సంస్థ మొత్తం రూ.6,394 కోట్లు గడించగా.. ఇందులో సంస్థ విస్తరణ ఖర్చులు, ఇతర ఖర్చులు పోను రూ.2,360 కోట్లు లాభంగా తేలిందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూ.2,360 కోట్ల లాభాల్లో మొత్తం 71 వేల మంది కార్మికులకు రూ.819 కోట్లను ప్రభుత్వం దసరా బోనస్ కింద పంపిణీ చేయనుందని తెలిపారు. 

తెలంగాణ సచివాలయంలో  సోమవారం (సెప్టెంబర్ 22) జరిగిన సింగరేణి కార్మికులకు వాటా పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలకమని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. దేశానికి విద్యుత్ వెలుగులో అందించడంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రత్యేకమని కొనియాడారు. 

కార్మికులకు బోనస్ పంచుతూనే భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా బోనస్ ఇస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సింగరేణి రెండు బొగ్గు బ్లాకులను కోల్పోయిందని.. ఆ రెండింటిని ప్రైవేట్ వ్యక్తులు దక్కించుకున్నారని తెలిపారు. బొగ్గు గనులను తిరిగి ప్రభుత్వం తీసుకునేలా ప్రయత్నం చేస్తామన్నారు.