ప్రత్యామ్నాయ పంటలపై సర్కార్ ఫోకస్

ప్రత్యామ్నాయ పంటలపై సర్కార్ ఫోకస్
  • ఏ పంటలు వేయిద్దాం?
  • జిల్లాల వారీగా డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన
  • స్పెషల్ డ్రైవ్ లు చేపట్టేందుకు సిద్ధమైన వ్యవసాయశాఖ

హైదరాబాద్‌, వెలుగు: యాసంగిలో వరిసాగు వద్దనడంపై ఓవైపు దుమారం కొనసాగుతుండగా మరోవైపు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటలపై స్పెషల్‌ డ్రైవ్‌కు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరులో రైతు వేదికల ద్వారా అభిప్రాయాలు సేకరించిన అధికారులు, తాజాగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేలా స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టాలని నిర్ణయించింది. వరి సాగును తగ్గించే దిశగా రైతులను సన్నద్ధం చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతు వేదికల్లో 8,098 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, తాజాగా ఏయే పంటలు వేస్తే లాభమో చెప్పాలని నిర్ణయించింది.  
డిమాండ్‌ ఉన్న పంటలపై అవేర్​నెస్
స్పెషల్‌ డ్రైవ్‌లో మద్దతు ధర, మార్కెట్లో డిమాండ్‌ పంటలపై రైతులకు చెప్పి వారికి భరోసా కల్పించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా మినుములకు డిమాండ్‌ ఉంది. ఇప్పటికే నాఫెడ్‌ మినుములు కొనుగోలు చేయాలని రాష్ట్రానికి సూచించింది. ఎంఎస్‌పీతో పాటు మార్కెట్‌ ధరతో కొనాలని ఆదేశించింది. ఎంఎస్పీ క్వింటాలుకు రూ.6,300 ఉండగా మార్కెట్​లో రూ.7 వేలు పలుకుతోంది. మార్కెట్‌ ధరకే మార్క్​ఫెడ్‌ ద్వారా మినుముల కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ఆవాలు, పప్పుశనగ, వేరుశనగ, నువ్వులు వేసేలా రైతులను ఒప్పించాలని సర్కారు నిర్ణయించింది.
జిల్లాల వారీగా పంటల ఖరారు 
జిల్లాల వారీగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా స్పెషల్‌ డ్రైవ్‌లో సన్నద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో పప్పుశనగ, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్‌ వేయించాలని నిర్ణయించారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో వేరుశనగ, సన్​ఫ్లవర్, నువ్వులు, పప్పుశనగ సాగుకు మళ్లించనున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాల్లో వేరుశనగ, సన్​ఫ్లవర్, పప్పుశనగ, పెసర వేసేలా వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.