సర్కారు శ్రద్ధపెడితేనే సదువులు సక్కగైతయ్

సర్కారు శ్రద్ధపెడితేనే సదువులు సక్కగైతయ్

నిరుడు పార్లమెంటరీ స్థాయీ సంఘం సహా అనేక అధ్యయనాలు కరోనా పరిస్థితుల వల్ల విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని, విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయని పేర్కొన్నాయి. ఇటీవల విడుదలైన నేషనల్​ అచీవ్​మెంట్​సర్వే ప్రకారం కూడా తెలంగాణ విద్యార్థులు అభ్యసన స్థాయిలో జాతీయ సగటు కంటే వెనుకబడ్డారు. సదువులు సక్కగ కావాల్నంటే సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. నేటి విద్యార్థులకు అందే నాణ్యమైన విద్యే రేపటి దేశ మానవ వనరుల సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది.  కానీ కరోనా మహమ్మారి, ప్రభుత్వాల పట్టింపు లేని ధోరణి కారణంగా పాఠశాల విద్యలో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ప్రత్యేకించి సర్కారు బడిలో చదివే పిల్లలు తీవ్రంగా వెనుకబడి పోతున్నారు. పిల్లల అభ్యసనా సామర్థ్యాలు తెలుసుకునేందుకు కేంద్రం నిరుడు నిర్వహించిన ‘నేషనల్​అచీవ్​మెంట్​సర్వే–ఎన్​ఏఎస్’ ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ అన్ని క్లాసుల విద్యార్థులు వెనుకబడినట్లు తేలింది. నిరుడు నవంబర్​12న దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో  తెలంగాణ నుంచి1,45,420 స్టూడెంట్లు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన సర్వే ప్రకారం.. మూడో తరగతి పిల్లలు చిన్న చిన్న పదాలు, గేయాలు చెప్పలేకపోతున్నారు, ఐదో తరగతి స్టూడెంట్స్ కు​ త్రిభుజం, చతురస్రం వైశాల్యం లెక్కలు కూడా రావడం లేదు. పదో తరగతిలో మాతృభాషలో, ఇంగ్లిష్​లో వాక్యాలు చదవలేకపోతున్నారంటే విద్యా ప్రమాణాలు ఏమేరకు పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. మూడో తరగతి స్టూడెంట్ల భాషా సామర్థ్యంలో జాతీయ సగటు62 శాతం ఉంటే.. తెలంగాణ పిల్లలది 48 శాతంగా ఉంది. గణితంలో 47కు 44 శాతం, ఈవీఎస్​లో 57 కు 45 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2017లో చేపట్టిన నేషనల్​అచీవ్​మెంట్​సర్వేతో పోలిస్తే పంజాబ్, రాజస్థాన్​ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అభ్యసన సామర్థ్యాలు, స్థాయి ప్రమాణాల్లో పతనం కనిపించడం ప్రమాద సంకేతమే.

కరోనా కారణంగా..

కరోనా మహమ్మారి వల్ల బడులు మూతపడటం పిల్లల అభ్యసన సామర్థ్యాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే అంశాన్ని నిరుడు పార్లమెంటరీ స్థాయి సంఘం సహా వివిధ సర్వేలు తేల్చి చెప్పాయి. 17 రాష్ట్రాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అధ్యయనం చేసిన నేషనల్​ఇండిపెండెంట్​స్కూల్​అలయన్స్​కూడా కరోనా మహమ్మారి చదువులను ఎట్లా పాడు చేసిందో పేర్కొంది. ఇప్పుడు నేషనల్​అచీవ్​మెంట్​సర్వే 2021కూడా పిల్లల అభ్యసన సామర్థ్యం వెనుకబాటుతనాన్ని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వెనుకబడిన పిల్లలకు అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం, బోధనా పద్ధతుల్లో మార్పులు, అదనపు తరగతుల నిర్వహణ లాంటివి చేపట్టాల్సిన అవసరం ఉంది. టీచర్లలో కూడా బోధనా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఎన్ సీఈఆర్ టీ, ఎస్​సీఈఆర్​టీలు కలిసి నూతన కార్యక్రమాలు రూపొందించాలి. మరికొన్ని రోజుల్లో బడులు తెరుచుకోగానే ఇంగ్లిష్​మీడియం బోధన ప్రారంభం కాబోతుంది. అయితే అభ్యసనంలో వెనుకబడిన పిల్లలను మెరుగుపరచకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధన విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి తక్షణావసరంగా నిదాన అభ్యాసకులపై ఫోకస్​పెట్టాల్సిన అవసరం ఉంది. 

విద్యా రంగ సమస్యలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో విద్యావ్యవస్థ రూపురేఖలే మార్చేస్తామని ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. కానీ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు కావొస్తున్నా.. విద్యారంగం సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదు. మౌలిక వసతులు, టీచర్ల ఖాళీలు, సిబ్బంది కొరత, నిధుల లేమి, పర్యవేక్షణ కొరత ఇలా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటి ప్రభావం విద్యార్థుల చదువు మీద తద్వారా విద్యా ప్రమాణాల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ రూపొందించడం ఆహ్వానించదగినదే.. అయితే నిధులు విడుదల చేయడంతోపాటు పనులు వేగవంతం చేస్తేనే.. ఫలితాలు ఉంటాయి.

 

ఖాళీల భర్తీ చేపట్టాలి..

రాష్ట్రంలో టీచర్ల ఖాళీలు, అధికారుల కొరత తీవ్రంగా ఉంది. 584 మండలాల్లో ఏడింటికి మాత్రమే రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంఈవోలు ఉన్నారు. 62 డిప్యూటీ డీఈవో పోస్టులు, 23 డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 20 వేల వరకు టీచర్ల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. వాటిని వెంటనే చేపట్టాలి. టీచర్ల పదోన్నతులు, ట్రాన్స్​ఫర్లు కూడా వీలైనంత తొందరగా పూర్తి చేస్తే విద్యా సంవత్సరంలో స్టూడెంట్లు నష్టపోకుండా ఉంటారు. సంస్థాగత సమస్యలు పరిష్కరించకుండా, ప్రభుత్వం ఎన్ని నూతన విద్యా సంస్కరణలు చేసినా వృథానే. ఇప్పటికైనా స్పందించి, పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి విద్యా ప్రమాణాలు మెరుగపరిచేందుకు కృషి చేయాలి.  

నిధులు పెంచాలి..

దేశంలో 17 రాష్ట్రాలతో పోలిస్తే విద్యకు బడ్జెట్​ కేటాయింపుల్లో మన రాష్ట్రం కింది స్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో విద్యారంగానికి సగటున13 శాతం నుంచి 20 శాతం నిధులు కేటాయిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం కేవలం 6.26 శాతం మాత్రమే కేటాయించింది. 2014లో రాష్ట్ర బడ్జెట్​లో విద్యారంగానికి 10.28 శాతం నిధులు కేటాయించగా.. 2022లో 6.26  శాతం కేటాయించింది. ఇలా క్రమంగా విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం విద్యారంగానికి నిధులు పెంచాలి. అప్పుడే సమస్యలు పరిష్కారమై విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-  సునిల్ పప్పుల,
రాష్ట్ర ఆర్గనైజింగ్​ సెక్రటరీ
పీఆర్టీయీ టీఎస్​