- భీమాలో 250 ఎకరాల్లో 130 ఎకరాల ఇష్యూ క్లియర్.. మరో 120 ఎకరాల్లో సమస్య
- నెట్టెంపాడులో విద్యుత్ శాఖకు 12 లక్షలు చెల్లించక పదేండ్లపాటు 30 వేల ఎకరాలకు లిఫ్ట్ బంద్
- విద్యుత్‌శాఖకు ఆ మొత్తాన్ని డిపాజిట్‌చేసిన ప్రభుత్వం
- దేవాదుల, పాలమూరు ప్రాజెక్టులు సహా పలుచోట్ల ఇలాంటి సమస్యలే గుర్తిస్తున్న సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల్లో భూసేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్న చిన్న సమస్యలతోనే ఏండ్లతరబడి భూసేకరణ ఆగిపోయి ప్రాజెక్టులు పెండింగ్ పడుతుండడంతో వాటిపై ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నది. ప్రస్తుతం 75 శాతం పూర్తయి.. మరో 25 శాతం పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల్లో భూసేకరణ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే నెట్టెంపాడు, భీమాలో సమస్యలను పరిష్కరించింది. ఇటు దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి, ఇంటిగ్రేటెడ్ సీతారామ –సీతమ్మసాగర్ ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్ చేసేందుకు చొరవ తీసుకుంటున్నది.
వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి 75 శాతం పూర్తయిన 18 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. ఏ కేటగిరీలో 6 ప్రాజెక్టులను 2025 నాటికి పూర్తి చేసి 47,882 ఎకరాలకు నీళ్లివ్వాలనుకుంది. మిగతా రెండు కేటగిరీల్లోని మరో 12 ప్రాజెక్టుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించింది. తద్వారా 5.8 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆయా ప్రాజెక్టుల్లో భూసేకరణే అతిపెద్ద సమస్యగా మారినట్లు, కోర్టు కేసులు, చిన్న చిన్న సమస్యలతోనే ప్రాజెక్టులు ఆగిపోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో విస్మరించిన అంశాలనే ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు పోతున్నది.
రూ.12 లక్షలియ్యక.. 30 వేల ఎకరాలు పడావు
నెట్టెంపాడు లిఫ్ట్‌పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. కెనాల్లో ఒక ఆక్విడెక్ట్ నిర్మాణానికి సంబంధించి చిన్న సమస్యనూ బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. ఆక్విడక్ట్నిర్మాణంలో కరెంట్పోల్స్ అడ్డుగా వస్తున్నాయి. వాటిని తొలగించేందుకు విద్యుత్ శాఖకు రూ.12 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంది. కానీ, ఈ విషయాన్ని గత సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా 30 వేల ఎకరాలకు నీళ్లివ్వలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఆ రూ.12 లక్షలను విద్యుత్ శాఖకు డిపాజిట్ చేసింది. దీంతో ఆ సమస్య క్లియర్ అయిపోయింది. ఇటు భీమాలో ఏండ్ల కొద్దీ పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యను పరిష్కరిస్తున్నది. ప్రాజెక్టు కోసం 250 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. 130 ఎకరాలు క్లియర్ చేసింది. మరో 120 ఎకరాల్లో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తోంది. ఆయా నిర్వాసితులకు సంబంధించిన డేటా తయారు చేసి వారితో సంప్రదింపులు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
12 ప్రాజెక్టులు.. రూ.7,500 కోట్లు
ప్రస్తుతం ప్రభుత్వం 12 ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకున్నది. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తే కొత్తగా 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు వీలుంటుంది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 14,700 ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. ఇందుకు రూ.7,500 కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు భూసేకరణ చేసేందుకు వీలుగా కనీసం రూ.2,500 కోట్లయినా కావాలని అంటున్నారు. ముఖ్యంగా దేవాదుల సమస్యను ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు కోర్టు కేసులతో చిక్కుముడులు వీడకపోతుండడంతో.. సామరస్యంగా సమస్యను పరిష్కరించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే కేబినెట్లో భూసేకరణకు ప్రభుత్వం లైన్‌క్లియర్ చేసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోనూ నాలుగు ప్యాకేజీలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్‌ను ఓకే చేసింది. అందులోనూ భూసేకరణ అంశాలను పరిగణనలోకి తీసుకున్నది. మోడికుంటవాగు, చనాక కొరాట వంటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నది.
