వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే సర్కార్ ఉద్యోగులకు జీతం

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే సర్కార్ ఉద్యోగులకు జీతం
  • ఇంట్లో వాళ్లందరూ వేస్కోవాల్సిందే
  • అధికారులు ఆర్డర్ ఇచ్చారంటున్న రేషన్ డీలర్లు 
  • వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే సర్కార్ ఉద్యోగులకు జీతం 
  • ఇంటర్నల్ గా సర్క్యులర్లు జారీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ ప్రతినెలా ఇచ్చే రేషన్ బియ్యం కావాలంటే కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్లే కుటుంబ సభ్యుడు.. తాను మాత్రం టీకా వేసుకున్నట్లు చూపెడితే సరిపోదు. ఇంట్లో వాళ్లందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని సర్టిఫికెట్లు చూపిస్తేనే బియ్యం ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా టీకా తీస్కోకపోతే, అక్కడే టీకా వేయిస్తున్నారు. గత మూడ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లందరూ ఇదే ఫాలో అవుతున్నారు. తమకు పైఅధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, ఆ మేరకే నడుచుకుంటున్నామని రేషన్ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగులు వ్యాక్సిన్ వేస్కుంటేనే వచ్చే నెల జీతం జమ చేస్తామంటూ వివిధ ప్రభుత్వ డిపార్ట్​మెంట్ల హెచ్ఓడీలు ఇంటర్నల్ సర్క్యులర్లు జారీ చేస్తున్నారు. ఎవరైనా ఇతర కారణాల వల్ల వ్యాక్సిన్ వేయించుకోకపోతే, దానికి సంబంధించి డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తేవాలంటున్నారు. తాజాగా టీకా వేస్కున్న ఉద్యోగులకే డిసెంబర్ జీతం ఇస్తామంటూ తెలంగాణ స్టేట్​కోఆపరేటివ్ బ్యాంక్ ఎండీ సోమవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాగా, ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ప్రభుత్వ ఉద్యోగులకు మొదట్లోనే స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సిన్ వేశారు. అయితే చాలామంది వేయించుకోలేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తేనే జీతం ఇస్తామని చెప్పడంతో... టీకా కోసం ఉద్యోగులు పరుగులు పెడుతున్నారు. 

ఒమిక్రాన్ ఆందోళనలతో... 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేశామని అధికారులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ టైమ్ లో టీకా కోసం జనాలు పరుగులు పెట్టారు. ఆ తర్వాత కేసులు తగ్గడంతో నిర్లక్ష్యం చేశారు. భయంతో కొంతమంది, అవగాహన లేక మరికొంత మంది వ్యాక్సిన్ కు దూరంగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌‌ స్పీడ్ తగ్గింది. డోసులు మిగిలిపోవడం, వ్యాక్సిన్​వేసుకునేందుకు జనాలు ముందుకు రాకపోవడం, మరోవైపు ఒమిక్రాన్ ఆందోళనలతో వ్యాక్సినేషన్ కు సంక్షేమ పథకాలను లింక్ చేస్తున్నారు. త్వరలో ఇండ్ల పర్మిషన్ కు, ఆసరా పెన్షన్ కు, ఉపాధి హామీ పథకానికి.. ఇలా ప్రభుత్వానికి సంబంధించి ఏ లబ్ధి పొందాలన్నా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడినోళ్లు 2 కోట్ల 77 లక్షల 67 వేల మంది ఉన్నారు. వీరిలో ఇంకా 20.80 లక్షల మంది ఫస్ట్ డోసు వేసుకోలేదు. ఇక సెకండ్ డోస్ వేసుకోనోళ్లు అయితే కోటీ 21 లక్షల మంది ఉన్నారు. వ్యాక్సినేషన్​లో హైదరాబాద్​ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, వికారాబాద్ లాస్ట్ ప్లేస్​లో ఉంది.