రూల్స్ పాటించని ప్రైవేట్ హాస్పి టల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై సర్కార్ కొరడా

రూల్స్ పాటించని ప్రైవేట్ హాస్పి టల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై సర్కార్ కొరడా
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, మేడ్చల్ జిల్లాల్లో ముమ్మర తనిఖీలు
  •     సిటీ పరిధిలోనే 224 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు
  •     వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌పై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. అనుమతులు లేకుండా దందా నడిపిస్తున్న హాస్పిటల్స్, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలకు రెడీ అయింది. కలెక్టర్ల ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో.. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో వందలాది మెడికల్ సెంటర్లు రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించింది. 

కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఏకంగా 224 హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అటు మేడ్చల్ జిల్లాలోనూ వందల సంఖ్యలో హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు నోటీసులిచ్చారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే హాస్పిటల్స్ సీజ్ చేస్తామని ఆయా జిల్లాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోలు స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ మరిచారు..

అల్లోపతి, ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ క్లినిక్‌‌‌‌‌‌‌‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో గుర్తించారు. చాలా హాస్పిటల్స్ అనుమతులు తీసుకోకపోవడం, మరికొన్ని గడువు తీరినా రెన్యూవల్ చేసుకోకుండానే నడుస్తున్నట్లు తేలింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ల (పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ) సిబ్బంది ద్వారా రూల్స్ బ్రేక్ చేస్తున్న హాస్పటల్స్ లిస్టును రెడీ చేసి షోకాజ్ నోటీసులిచ్చామని, వారం రోజుల్లో సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రూ.5 లక్షల వరకు పెనాల్టీ విధించేందుకు రంగం సిద్ధం చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్ట్ కింద పర్మిషన్లు లేకుండా వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. టీజీఎంసీ, పోలీసుల సహకారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, జైలుకు పంపిస్తామన్నారు. 

తప్పులు దిద్దుకుంటే పర్మిషన్.. 

మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ తనిఖీలు చేస్తున్నాం. క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్ట్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా ఉన్న హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు నోటీసులిస్తున్నాం. ప్రధానంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ టారిఫ్స్ పెట్టకపోవడం, డాక్టర్ల లిస్టు డిస్‌‌‌‌‌‌‌‌ప్లే చేయకపోవడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపించకపోవడం, గర్భిణుల స్కానింగ్ రికార్డుల నిర్వహణ లోపం వంటివి గుర్తిస్తున్నాం. ఆయా లోపాలను సరిదిద్దుకున్న తర్వాత, వాటిని మేము వెరిఫై చేశాకే మళ్లీ అనుమతులిస్తాం.   - డాక్టర్ ఉమా గౌరీ, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో మేడ్చల్ 

రిజిస్ట్రేషన్ లేకుంటే కఠిన చర్యలు.. 

హైదరాబాద్ సిటీలో దాదాపు 4 వేల ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. తాజా సర్వేలో చాలా వరకు రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీరికి నోటీసులు ఇచ్చాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హాస్పిటల్స్ మూసివేయాల్సిందే. ఒకవేళ సర్వేలో అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నట్లు తేలితే.. ఆ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ను సీజ్ చేయడమే కాకుండా, మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టిస్తాం. 
- వెంకటి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో, హైదరాబాద్