జీఎస్టీ కుంభకోణం: అసెంబ్లీ తర్వాత అరెస్టులు

జీఎస్టీ కుంభకోణం:  అసెంబ్లీ తర్వాత అరెస్టులు
  • 1,400 కోట్ల స్కాంపై ప్రభుత్వం సీరియస్
  • శాసన సభలో సర్కారు స్టేట్ మెంట్? 
  • ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు
  • 75 మంది వివరాలు ఆన్ లైన్ లో బంద్
  • ముమ్మరంగా దర్యాప్తు చేసుతన్న సీసీఎస్  

హైదరాబాద్: జీఎస్టీ కుంభకోణాన్ని సర్కారు సీరియస్ గా తీసుకుంటోంది. ఈ వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే సీసీఎస్ ఆధారాలు సేకరించింది. స్పెషల్ ఇన్షియేటివ్స్ వాట్సాప్ గ్రూపులో సోమేశ్ కీలకంగా ఉన్నారని సీసీఎస్ భావిస్తోంది. రూ. 1,400 కోట్ల ఈ కుంభకోణం అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తవించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. బడ్జెట్ సెషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్ మెంట్ ఇస్తారని తెలుస్తోంది.

ఆ తర్వాత సీరియస్ యాక్షన్ లోకి దిగే అవకాశం ఉంది. 75 మంది పన్ను చెల్లింపు దారులకు బెనిఫిట్ చేసేందుకు వారి పేర్లను ఆన్ లైన్ లో కనిపించకుండా చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. గత సర్కారు హయాంలో జరిగిన ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. అసెంబ్లీ సెషన్ పూర్తి కాగానే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ఏ5గా సోమేశ్ కుమార్

కమర్షియల్ ట్యాక్స్ , ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను కూడా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని.. ఆ గ్రూప్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణా బేవరెజస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్‌కు వేయి కోట్లు నష్టం వాటిన్నట్లు సమాచారం. మరో 11 ప్రైవేటు సంస్థలు రూ.400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు.

ఈ కేసులో మరికొంత మందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఏ -5గా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయ్యింది.

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లో చెల్లింపుల్లో రూ.1000 కోట్లు స్కామ్ జరిగినట్లు ఆరోపణల వచ్చాయి. నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించి నిందితుడు మోసాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఫోరెన్సిక్‌ అడిట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాజీ సీఎస్‌ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్కామ్‌ పాల్పడ్డ నిందితులపై ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. అసెంబ్లీ సెషన్ పూర్తి కాగానే వీళ్లకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారని సమాచారం.