- జులై 1 నుంచి కొత్త చట్టం అమలు నోటిఫికేషన్‌కు ఆమోదం
- గత్యంతరం లేకే అమలు.. పార్లమెంట్‌లోనూ నిలదీస్తాం
- మూసీ పునరుజ్జీవం ఫేజ్-1కు రూ.7,345 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు
- ఇకపై టీచర్లు, లెక్చరర్లకు స్కూళ్లు, కాలేజీల్లోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్
- టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఒకే
- వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని, న్యాయపరంగా పోరాడాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సెక్రటేరియెట్‌లో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన దాదాపు మూడు గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం.. మూసీ పునరుజ్జీవం ఫేజ్1, టిమ్స్‌లో ఉద్యోగాల భర్తీ, స్కూళ్లలో టీచర్లకు, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంటి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘వీబీ జీ రామ్ జీ చట్టం’లోని పలు నిబంధనలపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు పొంగులేటి తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉన్న ఈ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడనుందని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు వెల్లడించారు.
ఈ చట్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చేసిన పలు సిఫారసులపై చర్చించామని వివరించారు. ఇతర రాష్ట్రాలు కొత్త చట్టాన్ని ఆమోదించాయని.. ఈ క్రమంలో గత్యంతరం లేని పరిస్థితిలో, ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలనే ఆలోచనతో ఈ కొత్త చట్టాన్ని 2026 జులై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇందులో విధించిన కఠిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని, లీగల్‌గా ఫైట్ చేయాలని నిర్ణయించామన్నారు. పార్లమెంట్‌లోనూ కేంద్రం తీరును నిలదీయాలని తీర్మానించినట్లు చెప్పారు. కూలీలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయవద్దని ఈ ఏడాది జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ.. మరోసారి కేంద్రానికి తమ నిరసనను తెలియజేయనున్నట్లు తెలిపారు.
మూసీ ఫేజ్-1 పనులకు రూ.7,345 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్’ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్-1 పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి ఈసా, ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫూఘాట్ వరకు.. దాదాపు 21 కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి పనుల కోసం రూ.7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టుల క్రియేషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బంది డిప్యూటేషన్‌కు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
లక్షన్నర మందికి పథకం అమలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని ఇకపై వారితో పాటు టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పిల్లలకు నాణ్యమైన, పోషకాహారం అందించే లక్ష్యంలో భాగంగా క్వాలిటీ, జవాబుదారీతనం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంతో రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనున్నట్లు వివరించారు.
గిడ్డంగులు, నవోదయ స్కూళ్లకు భూములు
రాష్ట్రంలో విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కోసం పలు జిల్లాల్లో భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రులు చెప్పారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువులు దాచే గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలను, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ రేట్ ప్రకారం కేటాయించామన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేటాయించామని తెలిపారు. జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు వెల్లడించారు.
టిమ్స్ హాస్పిటల్స్‌కూ సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలు
కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ రిక్రూట్‌మెంట్ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సకల సౌకర్యాలతో వస్తున్న సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్ సహా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసినట్లు చెప్పారు. రోగులకు మెరుగైన వైద్య సేవలకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించిందన్నారు.
ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయని, ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇక్కడ అందించే వైద్య సేవలకు పేద ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్‌ఓసీలు కూడా ఇవ్వాలని తీర్మానించామని వెల్లడించారు.
