
- మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఆలయ పాలకమండళ్ల పోస్టుల భర్తీ
- గ్రంథాలయ, వక్ఫ్, ఆత్మ కమిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు కూడా..
- వెంటనే సీఎంకు జాబితా ఇవ్వాలని ఇన్ చార్జి మంత్రులకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆదేశం
- స్థానిక ఎన్నికల్లోగా భర్తీకి సన్నాహాలు
హైదరాబాద్: జిల్లాల్లో నామినేటెడ్ పదవుల భర్తీ సందడి మొదలు కానుంది. ఖాళీగా ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లా స్థాయి పదవులనూ భర్తీ చేయనున్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ.. కొద్ది నెలల పీసీసీ చీఫ్, మంత్రులకు ఈ టాస్క్ అప్పగించానని, జిల్లాల నేతల పేర్లు ఇవ్వడం లేదని అన్నారు. దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే స్పందిస్తూ ఇన్ చార్జి మంత్రులు జాబితాను సిద్ధం చేసి సీఎంకు ఇవ్వాలని సూచించారు.
స్థానిక ఎన్నికల కన్నా ముందుగా మార్కెట్ కమిటీల పాలక మండళ్లు, ఆలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల పాలక మండళ్లు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు, ఆత్మ కమిటీల నియామకం జరగనుంది. ఖాళీ ఉన్న స్థానాల్లో కొత్త వారిని నియమించనున్నారు. ఈ క్రమంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్య ఇవ్వనున్నారు. వీటి భర్తీ ప్రక్రియ ఇన్ చార్జి మంత్రులకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలకు బాధ్యలుగా ఉన్న ఇన్ చార్జి మంత్రులు జాబితాను సిద్ధం చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ చార్జి మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సారి పదవుల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. నామినేటెడ్ పదవులు పొందిన వాళ్లు స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సత్తా ఉన్న వారికే పదవులు దక్కే అవకాశం ఉందనే టాక్ ఉంది. ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా సామాజిక సమీకరణాలు అంచనా వేస్తూ జరిగే అవకాశం ఉంది.
కేసులు ఎత్తేయండి
గత ప్రభుత్వ హయాంలో పార్ట నేతలపై కక్ష పూరితంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అవసరమైతే ప్రత్యేకంగా కేబినెట్ సమవేశం ఏర్పాటు చేసి కేసులు ఎత్తివేయాలన్నారు.