- కుల వృత్తులకు మోడ్రన్ టచ్
- ‘బీసీ సంక్షేమ శాఖ’ ముసాయిదా రూపకల్పన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ వర్గాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జనాభాలో 56 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలను విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టేందుకు ‘విజన్ 2047’ పేరుతో ప్రణాళికలు రెడీ చేసింది. 2047 నాటికి బీసీల సాధికారతతో రాష్ట్రాన్ని దేశానికే రోడల్ మోడల్‌గా నిలపడమే లక్ష్యంగా ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.
వ్యవసాయం, కులవృత్తులే ప్రధాన జీవనాధారంగా ఉన్న ఈ వర్గాలను.. గ్లోబల్ కాంపిటీషన్ ను తట్టుకునేలా తీర్చిదిద్దడమే టార్గెట్‌గా ‘బీసీ సంక్షేమ శాఖ’ ముసాయిదాను రూపొందించింది. రాబోయే 20 ఏండ్లలో దశలవారీగా బీసీల సాధికారత కోసం తీసుకోవాల్సిన చర్యలను ఇందులో పొందుపర్చింది.
స్కిల్స్, ఎడ్యుకేషన్‌పైనే ప్రధాన ఫోకస్
బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు చదువు, స్కిల్స్ ప్రధానమని విజన్ డ్యాక్యుమెంట్ లో ప్రభుత్వం పేర్కొన్నది. బీసీ స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ దశల వారీగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామని తెలిపింది. వీటిల్లో స్టూడెంట్స్ కు డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ, ఏఐ, ఈవీ, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, ఎమర్జింగ్ సెక్టార్స్ రంగాల్లో స్కిల్స్ నేర్పించనున్నారు.
బీసీలు కేవలం సంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా.. మారుతున్న కాలానికి తగ్గట్టు బీసీ యువతను సిద్ధం చేయనున్నారు. ప్రతి జిల్లాలో ఇండస్ట్రీలతో లింక్ అయి ఉండేలా స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తారు. చేనేత, మత్స్యకార, నాయీబ్రాహ్మణ, రజక, స్వర్ణకారుల వృత్తులకు బ్రాండింగ్ కల్పించడంతో వారి ఉత్పత్తులను ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ప్రపంచ మార్కెట్ కు పరిచయం చేయనున్నారు. ప్యాకేజింగ్ యూనిట్లు, టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి సపోర్ట్ చేస్తారు.
పారదర్శక పాలన.. డిజిటల్ సేవలు
బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందేలా పూర్తి పారదర్శకత పాటించనున్నారు. స్కాలర్ షిప్స్, హాస్టల్స్, లోన్స్ అన్నీ ఒకే డిజిటల్ ఎకోసిస్టమ్ కిందికి తీసుకురానున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా పేపర్ లెస్ అప్లికేషన్లు, ఆటోమేటెడ్ రిలీజ్ సిస్టమ్ ఉంటుంది. బీసీల్లోనూ అత్యంత వెనుకబడిన, సంచార జాతులపై (ఎంబీసీలు) ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవారికి పెన్షన్లు, హౌసింగ్, ఇన్సూరెన్స్ వంటి సోషల్ సెక్యూరిటీని కల్పిస్తారు. వలస కార్మికులకు పోర్టబుల్ సోషల్ సెక్యూరిటీని అందించనున్నారు.
మూడు దశల్లో 2047 విజన్
విజన్ 2047ను మూడు దశలుగా బీసీ సంక్షేమ శాఖ డివైడ్ చేసింది. తొలి దశలో 2030 నాటికి 80 శాతం బీసీ పిల్లలకు పూర్తి స్థాయి విద్య అందించాలని నిర్ణయించారు. రెండో దశలో 2039 నాటికి కులవృత్తుల క్లస్టర్లు మోడ్రనైజ్ చేయడంతో పాటు బీసీ కుటుంబాలన్నింటిని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావాలి. మూడో దశలో 2047 నాటికి బీసీలను 100 శాతం డిజిటల్ లిటరసీ, ప్రపంచ స్థాయి కోర్సులు పూర్తి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.
