ఎమ్మెల్సీ ఎన్నికలు సెప్టెంబర్ తర్వాత పెట్టండి

ఎమ్మెల్సీ ఎన్నికలు సెప్టెంబర్ తర్వాత పెట్టండి

సెప్టెంబర్ తర్వాత పెట్టండి
 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో వాయిదా పడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను సెప్టెంబర్​తర్వాత నిర్వహించాలని, దీనిపై పరిశీలన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్​కుమార్ శనివారం ఈసీకి లెటర్ రాశారు. కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతున్నాయని, ఎన్నికలు పెడితే మరింత ప్రభావం పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన కొన్ని లోకల్ బాడీ ఎన్నికలనూ వాయిదా వేసినట్లు వివరించారు. కరోనా థర్డ్ వేవ్ సంకేతాలతో పాటు కేసులు పెరుగుతున్నాయని లెటర్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు జూన్ 3న ఖాళీ అయ్యాయి. వాస్తవానికి గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసీ మే 13న ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర సర్కార్ కు లెటర్ రాసింది.   

సర్కార్ ఎత్తుగడ అదేనా? 

ఎమ్మెల్సీ ఎన్నికలను ఇప్పుడే నిర్వహించొద్దని ఈసీని రాష్ట్ర సర్కార్ కోరడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హుజూరాబాద్​ఉప ఎన్నిక షెడ్యూల్​ను ఆలస్యం చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలను సెప్టెంబర్​తర్వాత నిర్వహించాలని సర్కార్ కోరిందని అంటున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో కరోనా సాధారణ స్థాయిలోనే ఉందని చెబితే, ఈసీ హుజూరాబాద్ కు కూడా నోటిఫికేషన్ ఇస్తుందేమోనన్న భయంతోనే సర్కార్ ఇలా చేసిందంటున్నాయి. ఎన్నిక ఆలస్యమైతే ఆ టైమ్ లోగా అక్కడ మరింత బలం పెంచుకోవచ్చనే ఎత్తుగడ వేసిందని అభిప్రాయపడుతున్నాయి. 

సభలకు లేని కరోనా.. ఎన్నికలకొచ్చిందా? 

రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవు. గత నెల రోజులుగా పొలిటికల్ మీటింగ్​లు చాలా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సహా మంత్రులు వరుసగా మీటింగులు పెడుతున్నారు. జూన్ లో వాసాలమర్రి గ్రామానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత సిరిసిల్లలోనూ బహిరంగ సభలో పాల్గొన్నారు. పైగా సీఎం ఈ నెల 2న హాలియాకు వెళ్లనున్నారు. అక్కడా మీటింగ్ పెట్టనున్నారు. ఇలాంటి సభల టైమ్ లో కరోనాను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర సర్కార్.. అసెంబ్లీలో నిర్వహించే ఎన్నికలను వద్దని చెప్పడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనాలకు సంబంధం లేని, కేవలం ఎమ్మెల్యేలే ఓటు వేసే ఎన్నికలను వద్దనడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా, రాష్ట్ర సర్కార్ రోజూ విడుదల చేసే కరోనా బులెటిన్ లో కేసుల సంఖ్య వెయ్యి లోపే ఉంటోంది. ఎమ్మెల్యేలు ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ, అసెంబ్లీలో పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ టైమ్ లో ఎన్నికలు వద్దని రాష్ట్ర సర్కార్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక భయంతోనే ఎన్నికలను వాయిదా వేయాలని సర్కార్ కోరుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.