జీఆర్ఎంబీ గెజిట్‌‌లో సవరణలు చేయండి

జీఆర్ఎంబీ గెజిట్‌‌లో సవరణలు చేయండి

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీఆర్‌‌ఎంబీ గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌లో పలు సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ఎత్తిపోతలు సహా పలు కీలక ప్రాజెక్టులను బోర్డు నిర్వహణ జాబితా నుంచి తొలగించాలంది. ఈ మేరకు గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్‌‌ఎంబీ) చైర్మన్‌‌ ముకేశ్‌‌ కుమార్‌‌ సిన్హాకు రాష్ట్ర ఇరిగేషన్‌‌ ఈఎన్సీ (జనరల్‌‌) మురళీధర్‌‌ సోమవారం లేఖ రాశారు. గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌లోని రెండో షెడ్యూల్‌‌లో పేర్కొన్న కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇప్పటికే సమర్పించామని, వాటి అనుమతుల ప్రక్రియ సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌‌లో ఉందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ, కన్నెపల్లి పంపింగ్‌‌ స్టేషన్‌‌, దేవాదుల లిఫ్ట్‌‌ స్కీంలోని గంగారం పంపుహౌస్‌‌, తుపాకులగూడెం బ్యారేజీ, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్‌‌) లిఫ్ట్‌‌ స్కీం, సీతారామ ఎత్తిపోతలు, దుమ్ముగూడెం ఆనకట్టను గెజిట్‌‌లోని షెడ్యూల్‌‌ -2 నుంచి తొలగించి రాష్ట్రమే వాటిని నిర్వహించుకునేలా షెడ్యూల్‌‌ -3లో చేర్చాలని కోరారు. ఈ ప్రాజెక్టులన్నీ తెలంగాణ భూభాగానికి మాత్రమే నీళ్లు అందించేందుకు డిజైన్‌‌ చేసినవని, వీటి ఇన్‌‌ఫ్లోస్‌‌, ఔట్‌‌ ఫ్లోస్‌‌ రెగ్యులర్‌‌గా జీఆర్‌‌ఎంబీ మానిటరింగ్‌‌ చేయలేదని, అందుకే బోర్డు నిర్వహణ పరిధి నుంచి వీటిని తప్పించాలని విజ్ఞప్తి చేశారు.  

కాళేశ్వరానికి అన్ని అనుమతులు తీసుకున్నం

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని, వరద ఎక్కువ ఉన్న రోజుల్లో అదనపు నీటిని తరలించడానికే అడిషనల్‌‌ టీఎంసీ ప్రాజెక్టు చేపట్టామని లేఖలో ఈఎన్సీ (జనరల్​) పేర్కొన్నారు. కందుకుర్తి లిఫ్ట్ స్కీం మైనర్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు అని, జీఆర్‌‌ఎంబీ టీం దీనిని సందర్శించి గెజిట్‌‌లో కొనసాగించాల్సిన అవసరం లేదని సూచించిందని తెలిపారు. కడెం ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఉపయోగించుకోవడానికే గూడెం ఎత్తిపోతల పథకం చేపట్టామని, దీని డీపీఆర్‌‌ ఈ ఏడాది జనవరి 27న బోర్డుకు సమర్పించామని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌లోని షెడ్యూల్‌‌ -1 నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ధర్మసాగర్‌‌ లేక్‌‌, స్తంభంపల్లె లేక్‌‌, ముచ్చెర్లనాగారం లేక్‌‌, కొర్కిశాల మాట్‌‌ ప్రాజెక్టులు మీడియం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు కావని వివరించారు.