- రాష్ట్రాన్ని ప్రజలే పాలించాలి,ఫ్యూడల్స్ కాదు: డిప్యూటీ సీఎం భట్టి
- కేబినెట్ మొత్తం సేవకులమే అని వెల్లడి
- రూ.1238 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆదిలాబాద్, వెలుగు: అంతరాలులేని సమాజం నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, ఒక్కో పాఠశాలను రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో కడుతున్నామని తెలిపారు. కోరితెచ్చుకున్న తెలంగాణను ప్రజలే పాలించాలని, ఫ్యూడల్స్ కాదన్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో రూ.1238 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేబినెట్ మొత్తం ప్రజలకు సేవకులే అని, పాలకులం కాదన్నారు. ‘‘అధికారం అంటే హోదా, పెత్తనం చెలాయించడమనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి, కేబినెట్ సభ్యులకు ఎవరికీ లేదు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే 99 శాతం హామీలు అమలు చేశాం.
అధికారంలోకి రాగానే రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. ఒక్కో ఇంటిని రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం. నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించాం. తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్రంలో ఆడబిడ్డలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. మహిళల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించింది” అని భట్టి తెలిపారు.
ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయి
రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాదు.. కొత్తగా పథకాలు అమలు చేస్తుంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమకు ఫోన్లు చేసి ‘‘మీ రాష్ట్రంలో ఇన్ని పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారు” అని అడుగుతున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. ఇంటి పెద్దకు అనుకోని ప్రమాదం జరిగితే భరోసాగా నిలవాలన్న ఆలోచనతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు.
రాష్ట్రంలోని ఏ బిడ్డ కూడా కాలే కడుపుతో బడికి వెళ్లకూడదని భావించిన సీఎం రేవంత్.. ప్రతిబిడ్డ బడికి రాగానే ఉదయం అల్పాహారంతో పాటు రాగిజావా లేదంటే పాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. విద్య కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
