ప్రయాణికులపై చార్జీల మోత

ప్రయాణికులపై చార్జీల మోత
  • 30 శాతం పెంచేందుకు సర్కార్​కు ఆర్టీసీ ప్రపోజల్
  • ఇప్పటికే మూడు నెలల్లో ఆరు సార్లు కిరాయిలు పెంచిన సంస్థ
  • సెస్‌‌ల పేరుతో 30 శాతం నుంచి 50 శాతం వడ్డింపు
  • టికెట్‌‌పై రూ.10 నుంచి రూ.100 దాకా మోత
  • డీజిల్‌‌ రేట్లు తగ్గినా.. టికెట్​ చార్జీలు పెంపు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రయాణికులపై ఆర్టీసీ వరుసబెట్టి చార్జీల మోత మోగిస్తోంది. సెస్‌‌లు, రౌండ్‌‌ ఫిగర్‌‌ పేరుతో భారీగా బాదుతోంది. మూడు నెలల్లో ఏకంగా ఆరు సార్లు చార్జీలను పెంచింది. దీంతో ఒక్కో టికెట్‌‌పై 30 శాతం నుంచి 50 శాతం దాకా రేట్లు పెరిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డీజిల్‌‌పై ఎక్సైజ్‌‌ డ్యూటీ తగ్గించినా.. డీజిల్‌‌ సెస్‌‌ పేరుతో ఆర్టీసీ భారీగా వడ్డించింది. ఇటీవల ఆర్టీసీ మేనేజ్‌‌మెంట్ మరో 30 శాతం టికెట్​ చార్జీలు పెంచేందుకు సీఎంకు ప్రపోజల్స్​ పంపింది. త్వరలో ఇది కూడా ఆమోదం పొందే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇలా వరుసగా రేట్లు పెంచుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు.
వరుసగా వడ్డింపు
డీజిల్‌‌ రేట్లు పెరిగాయని, నష్టాలు వస్తున్నాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని కొంత కాలంగా ఆర్టీసీకి చార్జీలు పెంచుకుంటూ పోతున్నది. మొదట పల్లె వెలుగు బస్సుల్లో రౌండ్‌‌ ఫిగర్‌‌ పేరుతో మొదలుపెట్టింది. టికెట్‌‌పై రూపాయి నుంచి రూ. 3 దాకా పెంచింది. తర్వాత సేఫ్టీ సెస్‌‌ అని బాదేసింది. బస్సు ప్రమాదాల్లో చనిపోయే వారికి చెల్లించే పరిహారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండనందున.. ఇప్పుడు ఆ మొత్తాన్ని జనం నుంచే రాబట్టాలంటూ సేఫ్టీ సెస్‌‌ను తీసుకొచ్చింది. టికెట్‌‌పై రూపాయి చొప్పున విధించింది. ఆ వెంటనే బస్‌‌ పాస్‌‌ ధరలపై భారీగా వడ్డించింది. ఒక్కో మంత్లీ పాస్‌‌పై బస్సు రకాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 దాకా పెంచింది. తర్వాత ప్యాసింజర్‌‌ సెస్‌‌ పేరుతో మళ్లీ ఒక్కో టికెట్‌‌పై రూ.5 పెంచింది. దీనికి రౌండ్‌‌ ఫిగర్‌‌ యాడ్‌‌ చేశారు. ఆపైన డీజిల్‌‌ సెస్‌‌ అంటూ సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగులో రూ.2, ఆపై బస్సుల్లో రూ.5 దాకా పెంచింది. ఇటీవల మళ్లీ డీజిల్‌‌ సెస్‌‌ పేరుతో కిలోమీటర్లను బట్టి టికెట్‌‌పై రూ.5 నుంచి 45తో పాటు స్టూడెంట్‌‌ బస్‌‌ పాస్‌‌లపై బాదింది.

కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా..

కేంద్రం డీజిల్‌‌ చార్జీలు పెంచిందని, దీని వల్లే చార్జీలు పెంచామని ఆర్టీసీ యాజమాన్యం పలు సందర్భాల్లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌‌, డీజిల్‌‌పై ఇప్పటికే రెండు సార్లు చార్జీలను తగ్గించింది. ఇటీవల డీజిల్‌‌పై ఎక్సైజ్‌‌ డ్యూటీ కూడా తగ్గించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కసారి కూడా వ్యాట్‌‌ తగ్గించలేదు. కేంద్రం నిర్ణయంతో ఇటీవల లీటరు డీజిల్‌‌పై సుమారు రూ.10 దాకా తగ్గింది. ఆర్టీసీలో రోజుకు 6 లక్షల లీటర్ల దాకా డీజిల్‌‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన ఆర్టీసీకి రోజుకు రూ.50 లక్షలకుపైగా ఆదా అవుతోంది. అయినప్పటికీ చార్జీలను తగ్గించకుండా భారీగా పెంచడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మూడు నెలల్లో 30 శాతం నుంచి  50 శాతం వరకు పెంచడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఒక్కో టికెట్‌‌పై కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.100 దాకా పెరిగింది. తెలంగాణలోని వివిధ లాంగ్‌‌ రూట్‌‌ బస్సులను పరిశీలిస్తే ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సుల్లో టికెట్‌‌పై రూ.40, సూపర్‌‌లగ్జరీలో రూ.50, రాజధానిలో 60, గరుడ ప్లస్‌‌లో 70 దాకా పెంచారు. దూరం పెరిగిన కొద్దీ చార్జీలు పెరగనున్నాయి. మరోవైపు వరుసగా పెంచిన చార్జీలతో ఆర్టీసీ మస్తు ఆదాయం సమకూరుతోంది. గతంలో రోజుకు రూ.12 కోట్లు కూడా దాటకపోగా.. ఇప్పుడు ఏకంగా 15 కోట్లకు పైనే ఆదాయం వస్తోంది. గత శుక్రవారం ఏకంగా 17 కోట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

మెయిన్‌‌ రూట్లలో ఇలా..

  • జేబీఎస్‌‌ నుంచి కరీంనగర్‌‌‌‌కు ఎక్స్‌‌ప్రెస్‌‌లో రూ.180 ఉండగా, ఇప్పుడు రూ.220కి చేరింది. సూపర్‌‌ లగ్జరీలో రూ.230 నుంచి రూ.280కి, రాజధానిలో రూ.310 నుంచి రూ.370కి, గరుడ ప్లస్‌‌లో రూ.370 నుంచి రూ.430కి చార్జీలు పెరిగాయి.
  • హైదరాబాద్‌‌‑ హనుమకొండ ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సులో టికెట్ రేటు రూ.170 నుంచి 200 అయ్యింది. సూపర్‌‌ లగ్జరీలో 215 నుంచి 270కి, రాజధానిలో 290 నుంచి 360కి, గరుడప్లస్‌‌లో 350 నుంచి 420కి చార్జీలు పెరిగాయి.
  • హైదరాబాద్‌‌ ‑ ఆదిలాబాద్‌‌ మధ్య సూపర్‌‌ లగ్జరీలో రేట్లను 460 నుంచి 560కి పెంచారు. రాజధానిలో రూ. 590 నుంచి రూ. 720కి చేరింది.
  • హైదరాబాద్‌‌ ‑ నిజామాబాద్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌లో 210 నుంచి 240కి, సూపర్‌‌ లగ్జరీలో 270 నుంచి 330కి పెంచారు.
  • ఎంజీబీఎస్‌‌ ‑ విజయవాడకు గరుడ ప్లస్‌‌లో రూ.620 నుంచి 700 పెరిగింది.
  • మరో 30 % పెంపు ఫైల్‌‌ పెండింగ్‌‌
  • ఆర్టీసీ ఫేర్‌‌ హైక్‌‌ ప్రతిపాదనలను గతంలో అధికారులు సీఎం కేసీఆర్‌‌కు పంపించారు. చార్జీల పెంపు ప్రతిపాదనలపై మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌ రివ్యూ నిర్వహించారు. తర్వాత మరోసారి రివైజ్డ్‌‌ ప్రపోజల్స్‌‌ను సీఎంకు పంపారు. 30 శాతం వరకు పెంచేలా రిపోర్ట్‌‌ ఇచ్చారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్‌‌ ఇప్పటి దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రపోజల్స్‌‌ ప్రకారం ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించారు. ఇందులో మినిమం చార్జీల పెంపు కూడా ఉంది. మినిమం చార్జీపై రూ.5 వరకు పెంచాలని ప్రతిపాదించారు.