- హైకోర్టు స్టేపై అప్పీల్‌కు వెళ్తాం: మంత్రి పొన్నం
- రెండేండ్లుగా గ్రీన్ చానల్ ద్వారా
- ఫండ్స్ ఇస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగబోవని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన పథకాలను నిలిపివేయబోమని, కోర్టు ఇచ్చిన గడువులోపే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్‌లో మంత్రి శ్రీహరితో కలిసి పొన్నం మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవిస్తుందని, అదే సమయంలో సమగ్ర కౌంటర్ అఫిడవిట్ ద్వారా పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, ప్రజా ప్రయోజనాన్ని కోర్టుకు వివరిస్తామని చెప్పారు. పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తామని పేర్కొన్నారు. పథకాలను ఎత్తివేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, గత ప్రభుత్వ పథకాలైనప్పటికీ రెండేండ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పథకాల నిధులను గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేస్తున్నామని గుర్తుచేశారు.
డివిజన్ బెంచ్‌కు అప్పీల్..
విజయ్ గోపాల్ అనే న్యాయవాది ఈ పథకాలకు సంబంధించిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారని మంత్రి వెల్లడించారు. దీంతో పథకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని, దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తున్నామని వివరించారు. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ పథకాలలో ఏమైనా న్యాయపరమైన లోపాలు ఉంటే అవి గత ప్రభుత్వం 2014లో సరైన ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్లే తలెత్తాయని పొన్నం ఆరోపించారు. అప్పట్లో పథకాలకు చట్టబద్ధత కల్పించి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. కౌంటర్ దాఖలులో అధికారుల లోపమా, ప్రభుత్వంలోని న్యాయపరమైన అంశాలను పరిశీలించే విభాగం లోపమా అనే విషయంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు..
హైకోర్టు స్టేను అడ్డుపెట్టుకుని బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని పొన్నం విమర్శించారు. స్టేపై ధర్నాలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారని, నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే బీఆర్‌ఎస్ తరఫున పిటిషన్‌లో ఇంప్లీడ్ కావొచ్చు కదా అని ప్రశ్నించారు. పథకాలపై రాజకీయాలు చేయడం అనవసరమన్నారు. గత పదేండ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతమందికి ఇండ్లు ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారో చర్చకు సిద్ధమని చెప్పారు.
రూ.16,375 కోట్లకుపైగా ఖర్చు..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇప్పటివరకు రూ.16,375.87 కోట్లకుపైగా ఖర్చు చేసి 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించామని మంత్రి వెల్లడించారు. ఇందులో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో రూ.7,803.05 కోట్లు ఖర్చు చేసి 7,79,401 మంది లబ్ధిదారులకు అందించామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులకు రాష్ట్ర బడ్జెట్ ద్వారా శాసనసభ ఆమోదం ఉంటుందని, ట్రెజరీ నిబంధనలు, ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ కమిషనర్ బాలమాయాదేవి, మైనార్టీ శాఖ కార్యదర్శి షఫీయుల్లా పాల్గొన్నారు.
