కబ్జా ముప్పున్న భూములను వేలం వేయండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కబ్జా ముప్పున్న భూములను వేలం వేయండి : డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క
  •     విలువైన ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
  •     అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
  •     మంత్రులు ఉత్తమ్​, జూపల్లితో కలిసి ఆదాయ వనరులపై రివ్యూ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్ ఏరియాల్లో ఉన్న సర్కార్ భూములకు తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. వివాదాలకు కేంద్రంగా మారి, కబ్జా ముప్పు పొంచి ఉన్న భూములను గుర్తించి బహిరంగ వేలం వేయాలని ఆదేశించారు. తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ‘రెవెన్యూ జనరేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అధికారులు పాల్గొని, వివిధ శాఖల ఆదాయ మార్గాలపై సమీక్షించారు.

ఏఐ టెక్నాలజీతో పెరిగిన ఆదాయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వల్ల మైనింగ్, రవాణా శాఖల్లో అక్రమ రవాణా తగ్గి ఆదాయం గణనీయంగా పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. పకడ్బందీ పర్యవేక్షణ కారణంగా కమర్షియల్ ట్యాక్స్ శాఖలో మూడు నెలల్లో 15% వృద్ధి నమోదైందన్నారు. ఇసుక రీచ్‌‌‌‌లు, క్రషర్ మైనింగ్ విభాగాల్లో జరుగుతున్న అక్రమ రవాణాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. భూముల విలువ పెంపుపై అధ్యయనం చేసిన కమిటీల నివేదికలను ముందుగా సబ్ కమిటీకి, ఆ తర్వాత కేబినెట్‌‌‌‌కు సమర్పించాలని ఆదేశించారు. 

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం రెవిన్యూ జనరేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని పేర్కొన్నారు. హెచ్‌‌‌‌ఎండీఏ భూముల విక్రయాలకు సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం కల్పించాలని, అప్పుడే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.