సోలార్ పవర్కు  మన రిజర్వాయర్లు బెస్ట్!

సోలార్ పవర్కు  మన రిజర్వాయర్లు బెస్ట్!
  • 10 వేల మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం
  • నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ  రిపోర్ట్​
  • ఇప్పటికే రామగుండంలో 100 మెగావాట్ల ఎఫ్ఎస్​పీ ఏర్పాటు
  • ఎల్ఎండీలో 300, మల్లన్న సాగర్ లో 500 మెగావాట్ల ప్లాంట్లు డీపీఆర్​దశలో..
  • ఒక్కో మెగావాట్​కు కోటికి పైగా కేంద్రం రాయితీ 
  • మరిన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చాన్స్.. ఇప్పటికే పోటీపడ్తున్న  ఎన్టీపీసీ , సింగరేణి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు, నీటి నిల్వ కేంద్రాలు ఫ్లోటింగ్ సోలార్​ ప్లాంట్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్ర జలాలపై ఏకంగా 10 వేల మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) తాజాగా నివేదిక ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఫ్లోటింగ్​ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 5వ స్థానం దక్కింది.

రామగుండంలోని ఎన్​టీపీసీ థర్మల్​ పవర్​ ప్లాంట్​కు అనుబంధంగా ఉన్న రిజర్వాయర్​లో ఇప్పటికే 100 మెగావాట్ల ఫ్లోటింగ్​ సోలార్​ పవర్​ ప్లాంట్ విజయవంతంగా నడుస్తోంది. ఇక లోయర్​ మానేర్​ డ్యామ్​ (ఎల్​ఎండీ)లో 300, మల్లన్న సాగర్​లో 500 మెగావాట్ల ప్లాంట్లు డీపీఆర్ దశలో ఉన్నాయి. కేంద్రం తాజాగా పీఎం సూర్య సరోవర్​ యోజన స్కీమ్​ కింద దేశవ్యాప్తంగా 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్ల ఏర్పాటు, స్టోరేజీ కోసం రూ.5,070 కోట్లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో మెగావాట్​కు రూ.కోటి చొప్పున రాయితీ ఇస్తామని ప్రకటించింది.

దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్లాంట్ల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీపీసీతోపాటు సింగరేణి పోటీపడుతున్నాయి.

ఫీజిబిలిటీ ప్రకారం రాష్ట్రానికి 5వ స్థానం..

నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) 2026లో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసింది. మొత్తం దేశంలో ఫ్లోటింగ్​ సోలార్​ సామర్థ్యం 102.18 గిగావాట్లు కాగా, రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ల సామర్థ్యం దాదాపు 10,720 మెగావాట్లు (10.72 గిగావాట్లు)గా పేర్కొన్నది. మహారాష్ట్రలో 16.28, మధ్యప్రదేశ్ 14.89, కర్నాటక 13.69, ఒడిశా 12.81 గిగావాట్లతో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నీటి వనరుల్లో 20% వైశాల్యాన్ని అంచనా వేసి ఈ నివేదిక తయారు చేసినట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్​టీపీసీ ఆసక్తి..

రాష్ట్రంలోని ఎల్లంపల్లి, మిడ్​ మానేరు, కొండపోచమ్మ సాగర్​లాంటి రిజర్వాయర్లు, భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ, కొత్తగూడెం జిల్లాలోని కేటీపీఎస్​ వంటి థర్మల్ ప్లాంట్లకు అనుబంధంగా ఉండే జలాశయాలు ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైనవని సర్వే రిపోర్ట్​లలో తేలింది. కాగా, ఎన్​టీపీసీ సంస్థ రామగుండంలోని తన ప్లాంట్​ అవసరాల కోసం ఏర్పాటుచేసిన రిజర్వాయర్​లో 100 మెగావాట్ల కెపాసిటీ గల ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​ ఏర్పాటు చేసింది. ఇది విజయవంతం కావడంతో రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నది. ఈ ప్రాజెక్ట్​పై రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నది.

ఎల్ఎండీలో 300, మల్లన్న సాగర్ లో 500 మెగావాట్ల ప్లాంట్లు..రాష్ట్రంలోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్​ఎండీ)లో 300, మల్లన్న సాగర్​లో 500 మెగావాట్ల ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సింగరేణి భావిస్తున్నది. ఈ సంస్థ ఇప్పటికే ఈ రెండింటిపై డిటైల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ (డీపీఆర్​) రెడీ చేసి ప్రభుత్వానికి పంపించింది. రెండు ప్రాజెక్ట్​లపై సుమారు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపన లక్ష్యంగా పెట్టుకున్నది.

భూసేకరణ సమస్య లేకపోవడం, నీటి ఆవిరి నష్టాలను తగ్గించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నది. ఇందుకోసం ఇప్పటికే 16 రిజర్వాయర్లపై ప్రి ఫీజిబిలిటీ స్టడీలు నిర్వహించింది. టీజీ రెడ్​కో, సింగరేణి, నీటిపారుదల శాఖతో పాటు ఇతర ప్రైవేట్​ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని జైపూర్​ థర్మల్​ పవర్ ప్లాంట్​ వద్ద 5 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​ ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నది. ఇక్కడే మరో 10 మెగావాట్ల అదనపు ప్లాంట్​ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది.